హైదరాబాద్, వెలుగు: ఇకపై పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లకుండానే మీ సేవ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను (పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ సర్వీస్) సమర్పించవచ్చని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా పారదర్శకమైన సర్వీసులను పెద్దలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్డీ) విభాగం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఈ సేవకు మంచి స్పందన లభిస్తోందని, వినియోగదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నదని చెప్పారు.
2022–23లో 143, 2023–24లో 31,295, 2024–25లో 64,612, ఈ ఆర్థిక సంవత్సరం నవంబర్ 11 వరకు 13,214 మంది పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారని, మొత్తం ఇప్పటివరకు 1.09 లక్షలకుపైగా సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలిపారు. ఈ సర్వీస్‌తో రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షలకుపైగా పెన్షనర్లు లాభపడుతున్నారని చెప్పారు. మీ సేవ యాప్‌లో ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణ వ్యవస్థతో గుర్తింపు పూర్తయిన వెంటనే లైఫ్ సర్టిఫికెట్ ఆటోమేటిక్‌గా ప్రభుత్వ రికార్డుల్లో అప్‌డేట్ అవుతుందని చెప్పారు. ఈ సేవ ద్వారా పెన్షన్ చెల్లింపులు అంతరాయం లేకుండా జరుగుతున్నాయని వెల్లడించారు.
