ఢిల్లీలో సీఎం రేవంత్..నేడు (నవంబర్ 18న) ఇండో- యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ

ఢిల్లీలో సీఎం రేవంత్..నేడు (నవంబర్ 18న) ఇండో- యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు:  రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన గురువారం యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ఫోరం (యూఎస్ఐఎస్పీఎఫ్) సమావేశానికి హాజరుకానున్నారు. ఇందుకోసం బుధవారం రాత్రి 10 గంటలకే ఢిల్లీ చేరుకున్నారు. రైజింగ్ ఇండియాలో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌‌లో యూఎస్–ఇండో సమిట్ నిర్వహించనున్నారు.

 ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటలకు జరిగే సమావేశంలో యూఎస్ఐఎస్పీఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇందులో తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతున్న అంశాలను హైలైట్ చేయడంతో పాటు అమెరికా–ఇండియా వాణిజ్య, సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడం లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. 

అలాగే రైజింగ్ 

తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలమైన అంశాలు, భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ ఆలోచనలను వారితో పంచుకోనున్నారు. హైదరాబాద్ వేదికగా ప్రభుత్వం చేపడుతున్న గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, అమెరికన్ కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేసే అంశాలను వివరించనున్నారు. ‘చైనా ప్లస్ 1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని, అలాంటి భవిష్యత్ ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని కంపెనీల ప్రతినిధులకు సీఎం వివరించనున్నట్టు సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి.  

రెండు లక్ష్యాలు...

ఈ సెషన్‌‌లో ప్రభుత్వం రెండు లక్ష్యాలను పెట్టుకుంది. తెలంగాణ ప్రాధాన్యాలు, పెట్టుబడి అవకాశాలు, పర్యావరణ వ్యవస్థ ప్రయోజనాలను అమెరికాకు చెందిన కంపెనీలు,  పెట్టుబడిదారులకు తెలియజేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని ముఖ్య వేదికగా మార్చుకోనున్నారు. యూఎస్ఐఎస్పీఎఫ్ సభ్యులు భారత్‌‌లో తెలంగాణను భవిష్యత్తు భాగస్వామిగా చూసేందుకు అవకాశం కల్పించడం, సాంకేతికత, తయారీ, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో సహకారం రెండో లక్ష్యంగా భావిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, పెట్టుబడి -విధానాలను స్పష్టం చేయడం, భారత్–యూఎస్ వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం.. ఈ సెషన్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

హైకమాండ్‌‌తో మీటింగ్.. 

యూఎస్ఐఎస్పీఎఫ్ మీటింగ్ అనంతరం పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్ బైపోల్‌‌లో కాంగ్రెస్‌‌నే గెలుస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం, తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రాక, కొత్తగా పలువురికి కీలక బాధ్యతలు, ఇతర అంశాలపై హైకమాండ్‌‌తో ఆయన చర్చించనున్నట్టు తెలిసింది. అలాగే పార్టీని అన్ని జిల్లాల వారీగా మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రి యపైనా చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. కాగా, శుక్రవారం జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి  తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. 

త్వరలో డీసీసీ అధ్యక్షుల నియామకం 

కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర డీసీసీ అధ్యక్షులను త్వరలో ప్రకటించనుంది. వీళ్ల ఎంపికపై గత నెల 25న పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, స్టేట్ ఇన్‌‌చార్జ్‌‌ మీనాక్షి నటరాజన్‌‌.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో డీసీసీ అధ్యక్షుల ఎంపికను రాష్ట్ర నేతలు హైకమాండ్‌‌కే అప్పగించారు. కాగా, దశల వారీగా రాష్ట్రాల డీసీసీ అధ్యక్షలను హైకమాండ్ ప్రకటిస్తున్నది. మంగళవారం పంజాబ్, ఉత్తరాఖండ్‌‌కు చెందిన డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది. త్వరలో రాజస్థాన్, చత్తీస్‌‌గఢ్‌‌, తెలంగాణ డీసీసీ అధ్యక్షులను ప్రకటించినున్నట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.