మూడో రోజూ మార్కెట్లకు లాభాలు.. కారణం ఇదేనా?

మూడో రోజూ మార్కెట్లకు లాభాలు.. కారణం ఇదేనా?
  • బిహార్ ఎగ్జిట్ పోల్స్‌‌తో మార్కెట్‌‌లో జోరు
  • 595 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌‌
  • కలిసొచ్చిన గ్లోబల్ అంశాలు

న్యూఢిల్లీ: బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు సెన్సెక్స్‌‌, నిఫ్టీ వరుసగా మూడో సెషన్‌‌లోనూ లాభపడ్డాయి. బిహార్‌‌‌‌లో మరోసారి ఎన్‌‌డీఏ ప్రభుత్వం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ మెరుగైంది.  దీంతోపాటు  అమెరికాలో షట్‌‌ డౌన్ ముగుస్తుందనే అంచనాలతో ఐటీ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి.  బీఎస్‌‌ఈ సెన్సెక్స్ బుధవారం 595 పాయింట్లు  (0.71 శాతం) పెరిగి 84,467 దగ్గర సెటిలవ్వగా, నిఫ్టీ 181 పాయింట్ల లాభంతో 25,876 వద్ద ముగిసింది. 

“నిఫ్టీ  వరుసగా మూడో సెషన్‌‌లోనూ లాభాల్లో కదిలింది. అమెరికాతో ట్రేడ్ డీల్‌‌ కుదురుతుందనే సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.  దీనికితోడు బిహార్‌‌లో ఎన్‌‌డీఏ ప్రభుత్వం వస్తుందని ఎగ్జిట్ పోల్స్ రావడం కలిసొచ్చింది”అని  హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ నందిష్ షా అన్నారు. యూఎస్ షట్ డౌన్‌‌ ముగుస్తుందనే అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు బుధవారం లాభాల్లో కదిలాయని  జియోజిత్ ఇన్వెస్ట్‌‌మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోత చేపడుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయని తెలిపారు.

 ‘‘గ్లోబల్ మార్కెట్లతో పాటే ఇండియన్ మార్కెట్లు లాభపడ్డాయి.  ఐటీ, ఆటో, ఫార్మా షేర్లు, ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ షేర్లు  మార్కెట్‌‌ ర్యాలీని ముందుండి నడిపించాయి.  ఇండియాలో రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌, హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్  తగ్గడంతో పాటు, ఏప్రిల్‌‌–సెప్టెంబర్‌‌‌‌కి గాను జీడీపీ ఔట్‌‌లుక్ మెరుగ్గా ఉండడంతో మార్కెట్ లాభపడింది”అని వినోద్ నాయర్ వివరించారు.  

ఆసియా మార్కెట్లలో సౌత్‌‌ కొరియా కొస్పీ, హాంగ్‌‌ కాంగ్ హంగ్ సెంగ్‌‌, జపాన్‌‌ నిక్కీ 225 ఇండెక్స్‌‌లు బుధవారం లాభాల్లో ముగియగా, షాంఘై ఎస్‌‌ఎస్‌‌ఈ కాంపోజిట్‌‌ ఇండెక్స్ నష్టాల్లో క్లోజయ్యింది. యూరప్ మార్కెట్లు లాభాల్లో కదలగా, యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ పాజిటివ్‌‌గా ట్రేడయ్యాయి. ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐలు) మాత్రం బుధవారం నికరంగా రూ.1,750 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.