ఖమ్మం సిటీలోని ఐదు తరగతులకు టీచర్ ఒక్కరే

ఖమ్మం సిటీలోని ఐదు తరగతులకు టీచర్ ఒక్కరే
  • టీచర్ల కొరతతో జూబ్లీపుర ప్రైమరీ స్కూల్ ​స్టూడెంట్స్ ఇబ్బందులు

ఖమ్మం టౌన్, వెలుగు :   ఖమ్మం సిటీలోని సారథినగర్ లో ఉన్న జూబ్లీపుర ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో 1 వ క్లాస్ నుంచి 5 వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న 68 మంది స్టూడెంట్స్ కు టీచర్  ఒక్కరే అన్ని పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది. టీచర్ గా, హెచ్​ఎంగా రెండు విధాలా విధులు నిర్వహిస్తున్న బాణోత్ భాస్కర్ కు అదనపు భారంగా మారింది. 

ముగ్గురు టీచర్లు ఉండాల్సిన స్కూల్  లో  ఒక్కరే అన్ని తరగతులకు సబ్జెక్టు ల వారీగా బోధించడం సమస్యగా ఉందని స్టూడెంట్స్ తల్లిదండ్రులు చెబుతున్నారు. వర్క్ అడ్జెస్ట్ మెంట్ లో భాగంగా రెండు నెలల కింద రఘునాథ పాలెం మండలం చిమ్మపూడి స్కూల్ నుంచి జూబ్లీపుర స్కూల్ కు ఓ టీచర్ ను విద్యాశాఖ కేటాయించింది. 

ఆమె జాయిన్ అయిన కొద్దీ రోజుల్లోనే ఆమెపై స్టూడెంట్స్ తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు రావడంతో తిరిగి పాత స్థానానికి టీచర్ గా పంపించారు. దాంతో దాదాపు అప్పటి నుంచి సుమారు 45 రోజులుగా జూబ్లీపుర స్కూల్​లో ఒక్క టీచరే పాఠాలు భోదిస్తూ నెట్టుకొస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్టూడెంట్స్​ పేరెంట్స్​ కోరుతున్నారు.