టీఎంసీ చాలెంజ్​తో రాజకీయాల్లోకి జడ్జి ఎంట్రీ

టీఎంసీ చాలెంజ్​తో రాజకీయాల్లోకి జడ్జి ఎంట్రీ

 కోల్​కతా: కుర్చీలో కూర్చుని తీర్పులివ్వడం కాదు.. రాజకీయాల్లోకి వచ్చి పోరాడండి చూద్దాం అంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు విసిరిన సవాల్​ను ఓ జడ్జి సీరియస్ గా తీసుకున్నాడు. హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా ఇచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చే లోక్​ సభ ఎన్నికల్లో పోటీ చేయడం కూడా దాదాపు ఖరారైందని ప్రచారం. బెంగాల్​ రాజకీయాల్లో చోటుచేసుకుందీ ఘటన.

 కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్​ గంగోపాధ్యాయ్ మంగళవారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి, సీజేఐకి, బెంగాల్​సీజే కు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. కాగా, టీఎంసీ కంచుకోట తమ్లుక్ లోక్​సభ నియోజకవర్గం నుంచి గంగోపాధ్యాయ పోటీ చేస్తారని తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

రెండేండ్లుగా విద్యారంగంలోని కొన్ని కీలక కేసులను జస్టిస్ గంగోపాధ్యాయ్​ విచారించారు. విద్యారంగంలో భారీ అవినీతి జరిగిందని తేల్చి ప్రభుత్వంలోని కొంతమంది ప్రముఖులను జైలుకు పంపించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌‌‌‌‌‌‌‌ పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ, సీబీఐ విచారణకు ఆదేశించారు. దీంతో జస్టిస్ గంగోపాధ్యాయ్ పై అధికార పార్టీ టీఎంసీ నేతలు, కార్యకర్తలు కోపం పెంచుకున్నారు. 

ఆయన తీర్పులను విమర్శించడంతో పాటు బెదిరింపులకు దిగారు. రాజకీయాల్లోకి వచ్చి పోరాడాలంటూ పలుమార్లు చాలెంజ్ చేశారు. దీంతో జస్టిస్ గంగోపాధ్యాయ్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. మంగళవారం హైకోర్టు చీఫ్ జ‌‌‌‌‌‌‌‌స్టిస్ టీఎస్ శివగ్ననమ్​ను కలిసి  గంగోపాధ్యాయ్ తన రాజీనామా అందజేశారు.

బీజేపీలో చేరుతున్నా..

‘తొలుత ప్రెస్​మీట్ పెట్టి నా రాజీనామాను ప్రకటించాలని భావించినా.. పెద్ద సంఖ్యలో గుమిగూడటంపై నిషేధం ఉంది. అందుకే రద్దు చేసుకున్నాను. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నరేంద్ర మోదీ చాలా కష్టపడే వ్యక్తి. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వస్తున్నా’ అని గంగోపాధ్యాయ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.