ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో నేడే తీర్పు

ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో నేడే తీర్పు

ప్రధాన నిందితుడిగా రాకేశ్ రెడ్డి
ముగ్గురు పోలీసులు సహా 11 మంది నిందితులు దోషులుగా తేలితే కఠిన శిక్షలు

హైదరాబాద్, వెలుగు : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు చెప్పనుంది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దోషులుగా తేలిన వారికి శిక్షలు ఖరారు చేయనుంది. 2019  జనవరి 31న సినీ ఫక్కీలో జయరాం హత్యకు గురైన విషయం తెలిసిందే. నాలుగేండ్ల తరువాత ఈ కేసులో కోర్టు తీర్పు వెలువడనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం ఈ కేసులో ముగ్గురు పోలీసులు, రియల్టర్లు నిందితులుగా ఉండడమే. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రియల్టర్  రాకేశ్  రెడ్డి, ముగ్గురు పోలీసులు సహా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. 73 మంది సాక్షులను విచారించారు. 2019 జూన్ 10న నాంపల్లి 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్  మేజిస్ట్రేట్  కోర్టులో  చార్జిషీటు దాఖలు చేశారు. అందులో రాకేశ్ రెడ్డి సహా ముగ్గురు పోలీసులు మరో ఎనిమిది మంది నిందితులపై అభియోగాలు పొందుపరిచారు. జయరామ్ హత్య తరువాత డెడ్ బాడీని తరలించేందుకు పోలీసులు సహకరించారని కోర్టుకు తెలిపారు. ఇందులో నల్లకుంట మాజీ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్ స్పెక్టర్ రాంబాబు,  ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిని నిందితులుగా పేర్కొంటూ అభియోగాలు దాఖలు చేశారు. జయరాం మేనకోడలు శ్రిఖాచౌదరిని 11వ సాక్షిగా చార్జిషీటులో పేర్కొన్నారు. ఆమె స్నేహితుడు సంతోష్  రావును కూడా సాక్షిగా చేర్చారు. రాకేశ్  రెడ్డితో పాటు పోలీసులు, మిగితా నిందితుల కాల్  డేటాను కోర్టుకు సమర్పించి హత్య జరిగిన విధానాన్ని వివరించారు. కాగా, మాజీ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాసులు, రాంబాబు, మాజీ ఏసీపీ మల్లారెడ్డిలపై చార్జిషీట్  దాఖలు కావడంతో నాలుగేళ్ల క్రితం వారిని విధుల నుంచి సస్పెండ్  చేశారు. దీంతో డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీపై  స్టే ఇవ్వాలని ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. మూడు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పి.నవీన్ రావు బెంచ్.. ఆ పిటిషన్లను కొట్టివేసింది. డిపార్ట్‌‌‌‌మెంటల్ ప్రొసీడింగ్స్ ను కొనసాగించవచ్చని తెలిపింది. ఓ వైపు కోర్టు విచారణతో పాటు డిపార్ట్ మెంటల్  విచారణను ముగ్గురు పోలీసులు ఎదుర్కోవాలని సూచించింది. దీంతో ముగ్గురు పోలీసులు విచారణకు సహకరించి  కోర్టుకు హాజరయ్యారు.