అఫిలియేషన్ లేకున్నా కాలేజీలు నడుస్తున్నయ్

అఫిలియేషన్ లేకున్నా కాలేజీలు నడుస్తున్నయ్

126 ప్రైవేట్ కాలేజీలకే ఇంటర్ బోర్డు గుర్తింపు

ఏడు జిల్లాల్లో అయితే ఒక్క కాలేజీకీ అఫిలియేషన్ ఇవ్వలే

మరో ఏడు జిల్లాల్లో ఒక్కొక్క కాలేజీకే గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్లపై ఇంకా అయోమయమే నెలకొంది. సెప్టెంబర్ 1 నుంచే అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగా.. ఇప్పటికీ కాలేజీల అఫిలియేషన్ ప్రాసెస్ పూర్తి కాలేదు. ఇప్పటివరకు 126 కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. అంటే మిగతా కాలేజీలన్నీ అనధికారికంగా కొనసాగుతున్నట్టే లెక్క. ఆయా కాలేజీల్లో చేరిన స్టూడెంట్లు ఆందోళనలో ఉన్నారు. మరి అఫిలియేషన్ రాని కాలేజీల్లో ఎన్నింటికి గుర్తింపు వస్తుందో? ఎన్నింటికి రాదో? అన్న క్లారిటీ లేదు. అయినా మేనేజ్‌మెంట్లు కాలేజీలు నడిపిస్తున్నాయి. అఫిలియేషన్‌తో సంబంధం లేకుండా ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. అన్నీ తెలిసినా బోర్డు అధికారులు చూసీచూడనట్టుగా ఉండిపోతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కాలేజీలంటే..

ఇంటర్ బోర్డు ఇప్పటివరకు అఫిలియేషన్​ ఇచ్చిన 126 కాలేజీల్లో.. హైదరాబాద్ లో 8, మేడ్చల్ 8, వికారాబాద్​7, వరంగల్ అర్బన్ 25, వరంగల్ రూరల్​4, ఆదిలాబాద్ 4, నిర్మల్ 3, కరీంనగర్​లో 9, మహబూబాబాద్ 5, ఖమ్మం 15, భద్రాద్రి కొత్తగూడెం 8, నిజామాబాద్ 2, సిద్దిపేట 2, సంగారెడ్డి 6, నల్గొండ 4, నాగర్ కర్నూల్ 3, యాదాద్రి 2, సూర్యాపేట 2, ములుగులో 2 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఇక సిరిసిల్ల, పెద్దపల్లి, రంగారెడ్డి, భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో కాలేజీకే అఫిలియేషన్​ ఇచ్చారు. మరో ఏడు జిల్లాలు.. కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, కామారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కాలేజీకి కూడా గుర్తింపు ఇవ్వలేదు.

గ్రేటర్ జిల్లాల్లో 16 కాలేజీలకే..

రాష్ట్రంలో 1,600 వరకు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ లేదనే కారణంతో పలు కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చేందుకు బోర్డు నిరాకరించింది. ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకుంటే.. కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని సర్కారు ఆదేశించినా అఫిలియేషన్ ప్రాసెస్ నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 126 కాలేజీలకు మాత్రమే గుర్తింపు ఇచ్చినట్టుగా అధికారిక వెబ్​సైట్‌లో పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో 16 జూనియర్ కాలేజీలకు అఫిలియేషన్ ఉండటం గమనార్హం.