జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలోకి..

జూనియర్​ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలోకి..
  • సమ్మె వాయిదా ప్రకటన ఏకపక్షంగా చేశారని రాష్ట్ర కమిటీ ఫైర్ 
  • స్టేట్ ప్రెసిడెంట్ గా రాజేశ్వర్​రావును తొలగిస్తూ నిర్ణయం 
  • జాబ్స్ నుంచి తొలగిస్తామంటూ జేపీఎస్ లకు డీపీఓల హెచ్చరిక 
  • ఎంపీడీఓలకు సమ్మె నోటీస్ ఇచ్చిన కారోబార్లు, మల్టీ పర్పస్ వర్కర్లు 
  • జాబ్​ రెగ్యులరైజ్ చేసే వరకూ ఉద్యమిస్తామని ప్రకటన 

కరీంనగర్/హైదరాబాద్, వెలుగు: తమ సర్వీసు ను రెగ్యులరైజ్ చేయాలని, ఓపీఎస్​లను జేపీఎస్​లుగా గుర్తించాలనే ప్రధాన డిమాండ్లతో జూనియర్ పం చాయతీ సెక్రటరీలు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలు శుక్రవారం నుంచి సమ్మె మొదలుపెట్టారు. విధులు బహిష్కరించి జిల్లా కేంద్రాలకు చేరుకొని నిరసనలు తెలిపారు. సమ్మెను తాత్కాలి కంగా వాయిదా వేస్తున్నట్లు సీఈఓ, డిప్యూటీ సీఈ ఓ, డీపీఓ, ఎంపీడీఓ, ఎంపీఓ, ఫోర్త్ క్లాస్ యూనియన్ల నేతలతో పాటు జేపీఎస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్ రావు సంతకాలతో గురువారం అర్ధరాత్రి నోట్ విడుదల చేయడంపై వారు మండిపడ్డారు. సమ్మెను నీరుగార్చే ప్రయత్నాలు చేసిన రాజేశ్వర్ రావును పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించిందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ వెల్లడించారు. జీతాలు పెంచాలంటూ కారోబార్లు, మల్టీపర్పస్ వర్కర్స్ కూడా ఎంపీడీఓలకు శుక్రవారం సమ్మె నోటీస్ ఇచ్చారు. 

రంగంలోకి జెడ్పీ సీఈఓల సంఘం నేత  

సమ్మె చేస్తామని 11నే కలెక్టర్లు, డీపీఓలకు నో టీసులిచ్చినప్పటికీ.. ఇన్ని రోజులు ఎలాంటి చర్య లు తీసుకోని పంచాయతీరాజ్ ఆఫీసర్లు ఒక్క రోజు ముందు సమ్మెను నీరుగార్చే ప్రయత్నాలు మొదలు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జెడ్పీ సీఈఓల సంఘం నేత ఒకరు సర్కార్ డై రెక్షన్​లో చర్చల పేరిట సమ్మె విచ్ఛిన్నానికి తెర లేపడం జేపీఎస్​ల్లో చర్చనీయాంశంగా మారింది. సదరు నేత గతంలోనూ జేపీఎస్​లను రెగ్యులరైజ్ చేయిస్తానని నమ్మించి.. హైదరాబాద్, -రంగారెడ్డి, మ హబూబ్​నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా తమతో భారీ సమావేశం ఏర్పాటు చేసి సర్కార్ మెప్పు పొందారని జేపీఎస్ లు గుర్తు చేస్తున్నారు. తర్వాత తమ సర్వీస్ మూడేం డ్లు పూర్తయిన సందర్భంలోనూ ఆయన పట్టించుకోలేదని, తీరా ఇప్పుడు ఆయనే ఒక రోజు ముందు రంగంలోకి దిగి సమ్మె వాయిదా ప్రకటన చేయించారని ఆరోపిస్తున్నారు.

కలిసిరాని సీనియర్లు.. సమ్మెలో ఓపీఎస్​లు 

రాష్ట్రంలోని జీపీల్లో మూడు కేటగిరీలకు చెందిన సెక్రటరీలు పని చేస్తున్నారు. వారిలో ఉమ్మడి ఏపీలో రిక్రూట్ అయిన సీనియర్ పంచాయతీ సెక్రటరీలు, నాలుగేండ్ల కింద రిక్రూట్ అయిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీల్లో భర్తీ అయిన ఔట్ సోర్సింగ్ సెక్రటరీలున్నారు. జూనియర్లు చేస్తున్న ఆందోళన లకు సీనియర్లు మద్దతిస్తూ వస్తున్నారు. సమ్మె విషయంలోనూ కలిసి వస్తామని చెప్పిన సీనియర్ సెక్రటరీలు.. తీరా సమయానికి వెనకడుగు వేశారు. జీతాలు పెంచాలని ఔట్ సోర్సింగ్ సెక్రటరీలు కూడా పోరుబాటపట్టారు. ఓపీఎస్ ల జీతం పెంపునకు సంబంధించిన ఫైల్ కమిషనర్ వద్ద ఉందని, సమ్మెలో పాల్గొనకపోతే క్లియర్ అవుతుందని.. లేదంటే కాదని ఓపీఎస్​లను బెదిరింపులకు గురిచేస్తూ వారిని డైవర్ట్ చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చివరి వరకు ప్రయత్నించారు.

ఇతర ఉద్యోగులకు ఇన్ చార్జ్ బాధ్యతలు

జేపీఎస్​లు సమ్మెలోకి వెళ్లడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.  రెగ్యులర్ సెక్రటరీలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, బిల్ కలెక్టర్లు, ఐకేపీ సీఏలు, ఏపీఎంలు, సూపరింటెండెంట్లు, ఎంపీఓలు, ఎంపీడీఓలకు రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం సాయంత్రం డీపీఓలు ఆదేశాలు జారీ చేశారు. సమ్మె ప్రభావం గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్ తదితర పనులపై లేకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 

అధికారుల బెదిరింపులు

గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలు, డీపీఓలు జేపీఎస్​లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. సమ్మెకు వెళ్లొద్దని, జాబ్ లు పోగొట్టుకుని జీవితాలు ఆగం చేసుకోవద్దని హెచ్చరించారు. ‘‘ఆర్టీసీ కార్మికులు, ఫీ ల్ట్ అసిస్టెంట్లు, వీఆర్ఏల సమ్మెతో పాటు నిన్నగాక మొన్న జరిగిన ఆర్టిజన్ల సమ్మె వరకు ఏం జరిగిందో తెలుసు కదా! మీరు సమ్మె చేస్తే సర్కార్ వినదు” అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని జేపీఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరీంనగర్​లో ఇద్దరే అటెండెన్స్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జేపీ ఎస్​లలో కేవలం ఇద్దరు మాత్రమే శుక్రవారం డీఎస్ఆర్ యాప్​లో అటెండెన్స్ వేశారు. ఇద్దరిలో ఒకరు నిన్నటి వరకు తెలంగాణ జేపీఎస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ జేపీఎస్ గౌరినేని రాజేశ్వర్ రావు కాగా.. మరొకరు మహిళా సెక్రటరీ. పొరపాటున అటెండెన్స్ వేసినట్లు చెప్పిన సదరు మహిళా సెక్రటరీ.. తోటి జేపీఎస్ ల తో కలిసి సమ్మెలో పాల్గొనడం విశేషం.