భారీ బందోబస్తు మధ్య ముగిసిన సోని అంత్యక్రియలు

భారీ బందోబస్తు మధ్య ముగిసిన సోని అంత్యక్రియలు

భారీ బందోబస్తు మధ్య ముగిసిన సోని అంత్యక్రియలు
తరలివచ్చిన జేపీఎస్​లు,  ప్రజా సంఘాల కార్యకర్తలు

వరంగల్/నర్సంపేట, వెలుగు : జూనియర్  పంచాయతీ సెక్రటరీ  సోని అంత్యక్రియలు శనివారం ఆమె తల్లిగారి ఊరు వరంగల్​ జిల్లా నర్సంపేటలో పోలీసుల భారీ బందోబస్తు  మధ్య  ముగిశాయి. అంత్యక్రియలకు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు,  వివిధ పార్టీలు, ప్రజా సంఘాల లీడర్లు  భారీగా తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్​, ఎడ్ల అశోక్​రెడ్డి సోనికి నివాళి అర్పించారు.  పాకాల రోడ్​ నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోని కుటుంబాన్ని ఆదుకోవాలని జూనియర్​ పంచాయతీ సెక్రటరీలు, ప్రజా సంఘాల కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు.  మధ్యాహ్నం సమయంలో అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి.  

సోనిది ఆత్మహత్యే 

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి జూనియర్​ పంచాయతీ సెక్రటరీ బైరు సోనిది ముమ్మాటికీ ఆత్మహత్యేనని స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు ప్రెస్​ నోట్​ రిలీజ్​ చేశారు.  సోని ఆత్మహత్యపై ఆమె తండ్రి బైరు శ్రీనివాస్​ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని చెప్పారు.  కొన్ని ప్రతిపక్ష పార్టీలు సోని మరణాన్ని అడ్డం పెట్టుకుని కావాలనే  తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుపట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు.  సోని మరణానికి ఆమె భర్తే కారణమని బాధితురాలి తల్లితండ్రులు పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు  చేశారని తెలిపారు. సోనికి చిన్న పాప ఉందని, ఉన్నత చదువులు చదివించే బాధ్యత తీసుకుంటానని కలెక్టర్​ హామీ ఇచ్చారని చెప్పారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో ఉపాధి కల్పిస్తామని వివరించారు.