- ఇప్పటికే తగ్గిన 2.294 టీఎంసీల నీటి నిల్వ
- సిల్ట్‌లో 93 శాతం మట్టి, 7 శాతం ఇసుక
- తీసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
- ఆయకట్టుపై ఎఫెక్ట్
- కేంద్ర ప్రభుత్వ డ్రిప్ స్కీంలో చేర్చేందుకు ప్రయత్నాలు
గద్వాల, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానమైన జూరాల ప్రాజెక్ట్‌కు సిల్ట్ కష్టాలు తీవ్రమయ్యాయి. రిజర్వాయర్‌లో పూడిక పేరుకుపోతుండడంతో నీటి నిల్వ సామర్థ్యం ఏటికేడు తగ్గుతోంది. ప్రాజెక్ట్‌లో పేరుకున్న సిల్ట్‌పై ఇప్పటికే రెండు సార్లు సర్వే చేయగా.. రెండు టీఎంసీల నీటి నిల్వ తగ్గినట్లు గుర్తించారు. కానీ సిల్ట్‌లో ఇసుక తక్కువగా ఉండడంతో పూడిక తీసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. రిజర్వాయర్ కెపాసిటీ తగ్గిపోతుండడంతో ఆయకట్టుపై ఎఫెక్ట్ పడుతోంది.
రెండు టీఎంసీలకు పైగా తగ్గిన కెపాసిటీ
జూరాల ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 11.6 టీఎంసీలు. కానీ సిల్ట్ పేరుకుపోతుండడంతో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతోంది. 2012లో టీఎస్ ఈఆర్ఎస్ సంస్థ సర్వే చేపట్టి 2.284 టీఎంసీల కెపాసిటీ తగ్గినట్లు నిర్ధారించారు. తర్వాత 2022లో మరొకసారి ఆర్‌వీ అసోసియేట్ కంపెనీ ఆధ్వర్యంలో సర్వే చేయగా.. 2.294 టీఎంసీల నీరు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 9.647 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
జూరాల ప్రాజెక్ట్‌లో సిల్ట్ తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రాజెక్ట్‌లో పేరుకుపోయిన పూడికలో 93 శాతం మట్టి, ఏడు శాతమే ఇసుక ఉన్నట్లు తేలింది. దీంతో పూడికను తొలగించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ టెండర్లు పిలిచి పనులు మొదలు పెడదామన్నా... మట్టిని స్టోర్ చేసే విషయంపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పూడిక తీసి మట్టిని స్టోర్ చేయాలంటే భూమిని సేకరించాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ డ్రిప్ స్కీంపై ఆశలు
జూరాల ప్రాజెక్ట్‌లో సిల్ట్ తొలగింపు పనుల కోసం కేంద్ర ప్రభుత్వ డ్రిప్ (డ్యాం రియాబిటేషన్ ఇంప్లిమెంటేషన్) స్కీమ్‌ను ఉపయోగించుకోవాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ స్కీమ్ కింద సిల్ట్ తొలగింపు పనులు చేపడితే... 80 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుంది. మిగతా మిగతా 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌ను డ్రిప్ స్కీంలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయకట్టుపై ఎఫెక్ట్
తెలంగాణలో కృష్ణా నదిపై తొలి ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. ఇందులో లెఫ్ట్, రైట్ కెనాల్స్ నుంచి 1.04 లక్షల ఎకరాలకు నీరు అందుతుండగా.. కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, బీమా లిఫ్ట్‌లు, సమాంతర కాల్వల ద్వారా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ సిల్ట్ కారణంగా నీటి నిల్వ సామర్థ్యం రెండు టీఎంసీలకు పైగా తగ్గడంతో లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుపై ప్రభావం పడుతోంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం
జూరాల ప్రాజెక్ట్‌లో సిల్ట్ పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సిల్ట్ తొలగింపు పనులపై దృష్టి పెట్టాం. వరద వచ్చే సమయంలో నీటిని ఎత్తిపోస్తూ ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.రహీముద్దీన్, ఈఈ, ఇరిగేషన్ శాఖ

