అడుగంటిన జూరాల.. అన్నదాత విలవిల.. ప్రాజెక్టులో 0.44 టీఎంసీలకు పడిపోయిన నీరు

అడుగంటిన జూరాల.. అన్నదాత విలవిల.. ప్రాజెక్టులో 0.44 టీఎంసీలకు పడిపోయిన నీరు
  • 50 వేల ఎకరాలకు అందని తడులు
  • సాగునీటి కోసం రైతుల ఎదురుచూపు

వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 0.44 టీఎంసీల నీరే ఉంది. నీరు తక్కువగా విడుదల చేస్తుండడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీంతో   చాలా చోట్ల పంటలు ఎండుతున్నాయి. దీనికి తోడు సాగునీరు అందించే ప్రధాన ఎడమ కాలువలో చెత్తాచెదారం, కాలువ లైనింగ్ వెంబడి చెట్లు ఏపుగా పెరగడం సమస్యగా మారింది. జిల్లాలో ఈ సీజన్‌‌లో సుమారు 1.75 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా, ఇందులో దాదాపు 50 వేల ఎకరాలు జూరాల చివరి ఆయకట్టులో ఉన్నాయి.
క్రాప్​ హాలిడేతో అయోమయం..

ప్రభుత్వం చివరి ఆయకట్టు ప్రాంతాలకు క్రాప్ హాలిడే ప్రకటించడంతో పంటలు వేసుకున్న రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కేవలం 10 వేల ఎకరాల వరకు మాత్రమే నీరందే అవకాశం ఉందని తెలుస్తోంది. వేసవి ప్రారంభం నుంచే ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టగా, ఇన్‌‌ఫ్లో లేకపోవడంతో నీటి సమస్య ఏర్పడింది. చివరి ఆయకట్టు మండలాలైన శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి రైతులు ప్రతి సంవత్సరం సాగునీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వరి పంట కోత దశలో ఉండటంతో మరో రెండు తడులు అవసరమని రైతులు చెబుతున్నారు. వర్షాకాలంలో వరద సమస్యలు ఎదురవుతుండగా, రబీలో క్రాప్ హాలిడే రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బోసిపోయిన ఘన్​పూర్​ ఆనకట్ట

మెదక్/ పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్ట కింద యాసంగి సీజన్‌‌లో వరి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంట చేతికందే దశలో నీటి తడులు అందక వరి ఎండుముఖం పడుతుండటంతో వేలాది మంది రైతులు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఘనపూర్ ఆనకట్ట కింద కొల్చారం, పాపన్నపేట, మెదక్ రూరల్, మెదక్ టౌన్, హవేలి ఘనపూర్ మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. సాధారణంగా సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదలైతేనే ఈ ప్రాంతాల్లో సాగు జరుగుతుంది. అయితే ప్రాజెక్ట్ మరమ్మతుల కారణంగా ఈ యాసంగి సీజన్‌‌కు క్రాప్ హాలిడే ప్రకటించారు.

అయినప్పటికీ రైతులు బోర్ల ఆధారంగా సుమారు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా సింగూర్ నుంచి రెండు సార్లు నీరు విడుదల కావడంతో ఘనపూర్ ఆనకట్ట నిండి కాల్వలకు నీరు చేరి వరి పంటలు ఎదిగాయి. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండగా ఆనకట్టలో నీరు పూర్తిగా తగ్గిపోయి కాల్వలు వెలవెలబోతున్నాయి. ఎండలతో భూగర్భ జలాలు కూడా తగ్గిపోవడంతో బోర్ల ద్వారా సరిపడా నీరు అందడం లేదు. కీలక దశలో నీటి కొరతతో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీఆర్​ఎస్​కు చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి రైతులతో వెళ్లి మానవ హక్కుల కమిషనర్‌‌ను కలిశారు. 0.3 టీఎంసీ నీటిని విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్​ సెక్రటరీకి సిఫారస్ చేశారు.