
Microsoft Layoff: ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో కూడా అస్సలు అర్థం కావటం లేదు. ఏఐ యుగంలో ఉద్యోగం నిలకడగా ఉంటుందనుకోవటం పెద్ద కలే అని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజా చర్యలు నిరూపిస్తున్నాయి. గడచిన కొన్నేళ్లుగా ఈ కంపెనీ భారీ సంఖ్యలో ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీలో 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఒక ఉద్యోగి తొలగింపుకు గురయ్యాడు. అయితే ఈ తొలగింపు ఉద్యోగి పనితీరుకు సంబంధించి జరగలేదు. ఒక కంప్యూటర్ అల్గారిథం తీసుకున్న నిర్ణయం కారణంగా సదరు టెక్కీ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి రావటం ఏఐ వల్ల ప్రమాదాన్ని నిరూపిస్తోంది. తన భర్త 48వ పుట్టినరోజున కంపెనీ నుంచి వచ్చిన లేఆఫ్ మెయిల్ తమకు దిగ్భాంతిని కలిగించిందని ఆమె పోస్టు చేయటంతో అసలు విషయం బయటకు వచ్చింది. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తాయనేది ప్రస్తుతం రెడిట్ వేదికగా పెద్ద చర్చకు దారితీసింది.
Also Read : టెక్కీలకు శుభవార్త..
తన భర్త కంపెనీ కోసం తన పోస్టు కంటే ఎక్కువ సేవలను అందించాడని ఆమె వెల్లడించింది. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ పెద్దగా సెలవులు కూడా తీసుకోడని, పైగా వారానికి 60 గంటల పాటు పనిచేసేవాడని పేర్కొంది. అలాగే సెలవు రోజుల్లో కూడా కంపెనీ కోసం పనిచేసేవాడని పేర్కొన్నారు. అతడు తనకిచ్చిన పనిని శ్రద్ధతో చేస్తూ సమస్యలను పరిష్కరించేవాడే తప్ప ఎప్పుడూ హైక్స్, ప్రమోషన్స్ కోసం వెంపర్లాడేవాడు కాదని పేర్కొంది.
కంపెనీ తన మధ్యస్థాయి మేనేజర్లను తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ ఏకంగా 3 శాతం అంటే 6వేల మంది ఉద్యోగులను ప్రపంచ వ్యాప్తంగా తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ఉద్యోగి తొలగింపు కూడా ఇందులో భాగంగానే జరిగిందని తెలుస్తోంది. కేవలం వాషింగ్టన్ ప్రాంతంలోనే దాదాపు 2వేల మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నిర్ణయం వల్ల ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. కంపెనీ ఏఐపై దృష్టిపెట్టడంతో పాటు ఖర్చులను తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మెగా లేఆఫ్స్ మేళా కొనసాగుతోంది. అయితే ఈ నిర్ణయం వేల మంది ఉద్యోగుల జీవితాలకు శాపంగా మారిందని నెటిజన్లు అంటున్నారు.