అత్యంత విలువైన సంపద ఆరోగ్యం : సూరేపల్లి నంద

అత్యంత విలువైన సంపద ఆరోగ్యం : సూరేపల్లి నంద

ఆసిఫాబాద్, వెలుగు: మానవ జీవితంలో అత్యంత విలువైన సంపద ఆరోగ్యమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సూరేపల్లి నంద అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ కలెక్టరేట్​లో దియాలిబాయి లాల్ చంద్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ దయానంద్ గౌరి, సభ్యులు మీరా గౌరి సౌజన్యంతో హైదరాబాద్​లోని మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో లాయర్లు, కోర్టు సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, మెగా న్యాయ అవగాహన సదస్సుకు ఆమె చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు.

పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆమె  మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. ప్రపంచం క్యాన్సర్ ముప్పును ఎదుర్కొంటోందని, ప్రాథమిక స్థాయిలోనే నిర్ధారణ జరిగితే వెంటనే చికిత్స తీసుకొని వ్యాధిని అరికట్టవచ్చని సూచించారు. ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్, కార్డియాక్ స్క్రీనింగ్, ఈ ఎన్ టి, డయాబెటిస్, దంత సమస్యలు, ఇతరత్రా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి వ్యక్తి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, చట్టం ముందు అందరూ సమానమేన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎంవీ రమేశ్, కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేశ్ ​కుమార్, డీఎఫ్ఓ నీరజ్ కుమార్, డీఎం అండ్​హెచ్ ఓ తుకారాం, ఆసిఫాబాద్, సిర్పూర్ జూనియర్ సివిల్ జడ్జిలు యువరాజ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.