ప్రవళిక ఆత్మహత్య సర్కార్ హత్యే: జస్టిస్​ చంద్రకుమార్

ప్రవళిక ఆత్మహత్య సర్కార్ హత్యే: జస్టిస్​ చంద్రకుమార్
  • కేసీఆర్ ఫ్యామిలీలోనే 5 ఉద్యోగాలొచ్చినయ్: జస్టిస్​ చంద్రకుమార్
  • ఒక్క పరీక్ష కూడా సక్రమంగా జరగలేదు
  • ప్రజలను మోసం చేస్తున్న  కేసీఆర్, మోదీకి బుద్ధి చెప్పాలి
  • సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం

హైదరాబాద్, వెలుగు: ప్రవళిక ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రవళిక ఆత్మహత్యపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకుమార్ మాట్లాడారు.  నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు రావడంలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పారని, వాళ్ల ఇంటికి మాత్రమే ఐదు ఉద్యోగాలు వచ్చాయన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కూడా మోసం చేశారన్నారు.

 2014లో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉండగా, 2018 నాటికి ఆ సంఖ్య 2.70 లక్షలకు చేరిందన్నారు. ఉద్యోగాల నియామకాల విషయంలో టీఎస్ పీఎస్సీ ఫెయిల్ అయిందన్నారు. ప్రవళిక మూడు పరీక్షలకు దరఖాస్తు చేస్తే అసలు ఏ పరీక్షకు దరఖాస్తు చేయలేదని మంత్రి కేటీఆర్ ఎలా అంటారని ప్రశ్నించారు. దళితులకు దళితబంధు ఇవ్వాలంటే 180 ఏండ్లు పడుతుందన్నారు. కేసీఆర్ చేతిలో ఇప్పటికే రెండు సార్లు మోసపోయామని, మరోసారి మోసపోవద్దన్నారు. ప్రధాని మోదీ కూడా మోసం చేస్తున్నారన్నారు. 

ఒక్క రైల్వేలోనే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అదానీ, అంబానీల ఆస్తులు పెంచేందుకే మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మహిళలకు భద్రతలేకుండా పోయిందని, మణిపూర్​లో బట్టలు లేకుండా మహిళలను తిప్పితే కూడా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్​లను తరిమికొట్టాలని, వారికి మద్దతుగా ఉన్న ఎంఐఎంనూ వదలొద్దని అన్నారు. 

శివరామ్​​ను బలి చేస్తారా?

 సీపీఐ ఎంఎల్ ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి సభ్యురాలు రమ మాట్లాడుతూ, ప్రవళిక నిజంగా ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకుంటే అందుకు ఆధారాలు ఎందుకు చూపలేదన్నారు. పీవోడబ్ల్యూ నేషనల్ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ.. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకుంటే ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్య చేసుకుందని నాటకం ఆడుతున్నారన్నారు. ప్రవళిక ఆత్మహత్య సంఘటన మరువక ముందే పెద్దపల్లిలో మరో నిరుద్యోగి రహ్మత్ సూసైడ్​ చేసుకున్నాడని, మరి కేటీఆర్ దానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆయేషా కేసులో సత్యంబాబు లాగా ఇప్పుడు శివరామ్​​ను బలి చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.

 తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ ​సర్వీస్ ​కమిషన్​.. ప్రగతి భవన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లా మారిందన్నారు. 9 ఏండ్ల తరువాత నిర్వహించిన నోటిఫికేషన్​లో 150 ప్రశ్నలకు 22 తప్పులు ఉన్నాయన్నారు. న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు(సీపీఐ ఎంల్) కె. గోవర్ధన్ మాట్లాడుతూ.. ప్రవళిక కుటుంబానికి కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, అలాగే పరీక్షలు రాసి మోసపోయిన నిరు ద్యోగులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వాలని, టీఎస్​పీఎస్సీని ప్రక్షాళన చేయాలన్నారు. సమావేశంలో  ఇండియన్ నేషన్ మూవ్ మెంట్ కన్వీనర్ కృష్ణ ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా, సోగరాబేగం, ఎన్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.