ఆ ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపుల వల్లే నా కూతురి ఆత్మహత్య

ఆ ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపుల వల్లే నా కూతురి ఆత్మహత్య
  • మద్రాస్ ఐఐటీ సూసైడ్‌ చేసుకున్న కేరళ యువతి ఫాతిమా
  • తమిళనాడు సీఎంను కలిసేందుకు వచ్చిన ఆమె తండ్రి
  • చదువు ఒత్తిడి వల్లేనని కేసు మూసేసే యత్నం జరుగుతోందని ఆరోపణ

చెన్నై: మద్రాస్ ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్యకు కారణం ముగ్గురు ఫొఫెసర్ల వేధింపులేనని ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ, చదువు ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకుందంటూ కేసు మూసేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. తన బిడ్డ చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడులో సంచలనం కలిగిస్తున్న ఈ కేసు విషయంలో ఫాతిమా తండ్రి అబ్దుల్ లతీఫ్ కేరళ తిరువనంతపురం నుంచి ఇవాళ చెన్నై వచ్చారు.

సీఎం, డీజీపీకి ఆధారాలు

చెన్నై ఎయిర్ పోర్డులో ఫాతిమా తండ్రి మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితోపాటు డీజీపీకి అందజేస్తానని తెలిపారు. తన కుమార్తె చావుకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చదువుల ఒత్తిడి.. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ కేసు మూసేసేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. కానీ, తన చావుకు ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపులే కారణం అంటూ వారి పేర్లతో సహా  రాసిన నోట్‌ ఆమె సెల్‌ఫోన్‌లో కనిపించిందని ఫాతిమా తండ్రి తెలిపారు. యూనివర్సిటీలో విద్యార్థులు కూడా తమ తోటి విద్యార్థినికి నాయ్యం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ‘జస్టిస్ ఫర్ ఫాతిమా లతీఫ్’ పేరుతో వర్సిటీ అధికారులపై, పోలీసులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని స్టూడెంట్ యూనియన్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టాయి.

కేసు మలుపు తిప్పిన సెల్‌ఫోన్

కేరళలోని కొల్లంకు చెందిన ఫాతిమా లతీఫ్‌(19) ఐఐటీ మద్రాస్‌లో హ్యుమానిటీ సైన్సైస్‌లో MA మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 9న ఆమె తన హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందామె. చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందంటూ మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. ఫాతిమా సోదరి ఆయేషా ఆమె ఫోన్‌ను పరిశీలించగా.. ‘నా చావుకు కారణం సుదర్శన్‌ పద్మనాభన్‌’ అనే నోట్‌ కనిపించింది. మరో నోట్‌లో ఆమె.. తన చావుకు కారణం తన ప్రొఫెసర్లయిన హేమచంద్రన్‌ కరాహ్‌, మిస్టర్‌ మిలింద్‌ బ్రాహ్మే వేధింపులే అని స్పష్టం చేసింది. ఈ నోట్‌ను ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు అందజేశారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. చెన్నై పోలీసు కమిషనర్‌ రంగంలోకి దిగి ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా.. ఐఐటీ మద్రా‌స్‌లో ఏడాది వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.