
- వాటికి బదులిచ్చే వేదిక జడ్జిలకు లేదు: జస్టిస్ మౌసమీ భట్టాచార్య
హైదరాబాద్, వెలుగు: అసంతృప్తితో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులకు న్యాయమూర్తులను దూషించే ధోరణి ఎక్కువగా కనిపిస్తోం దని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ విచారణ నుంచి వైదొలగాలని, వాటిని బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారంది. న్యాయమూర్తులపై ఏకపక్ష ఆరోపణలు చేయడం న్యాయపరిపాలనపై ప్రభావం చూపుతుందని శుక్రవారం పేర్కొంది. న్యాయమూర్తులపై వ్యక్తిగత దాడు లు నిష్పాక్షిక నిర్ణయాన్ని తీసుకోవడానికి అడ్డంకిగా మారతాయంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లిలోని భూ వివాదంలో పెద్దిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో సీఎం రేవంత్ రెడ్డిని నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ కేసును కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య.. ఆధారాల్లేకుండా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారంటూ కేసును కొట్టి వేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే, తాము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, తీర్పు వెలువరించవద్దన్న ఫిర్యాదుదారు వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీనిపై ఫిర్యాదుదారు పెద్దిరాజు ఈ పిటిషన్‌ను బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, వాదనలకు అవకాశం ఇవ్వలేదని పిటిషనర్ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వారి పిటిషన్‌ను కొట్టివేసింది.
అంతేగాకుండా, న్యాయమూర్తిపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. ఫిర్యాదుదారు పెద్దిరాజుతో పాటు ఆయన తరఫు న్యాయవాదులు రితేష్ పాటిల్, నితిన్ మహేశ్రం న్యాయమూర్తికి క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గురు క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటు శుక్రవారం వ్యక్తిగతంగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా పిటిషనర్లు క్షమాపణ కోరుతూ దాఖలు చేసిన అఫిడవిట్‌లను అనుమతిస్తున్నామని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేశారు.
న్యాయమూర్తులపై దాడులను రాతపూర్వకంగా, సామాజిక మాధ్యమాల్లో దాడులు చేసేవారు ఒక బటన్ నొక్కడంతో ప్రచారం చేస్తారని, అయితే న్యాయమూర్తికి దానిపై సమాధానం ఇవ్వడానికి ఎలాంటి వేదిక ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ మౌసమీ భట్టాచార్య కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టుకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.