
- బాడీ వార్న్ కెమెరాల వాడకం ఆపేసిన పోలీసులు
- తప్పుచేసిన పోలీసులను, వాహనదారుల గుర్తించేలా రికార్డింగ్
- యూస్ చేయడంలో లైట్ తీసుకుంటున్న పోలీసులు
- దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిర్పూర్కర్ కమిషన్ రిపోర్ట్ తో మరోసారి తెరపైకి
పీపుల్ ఫ్రెండ్లీ పోలిసింగ్ లో భాగంగా బాడీ వార్న్ కెమెరాలను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు వినియోగించాలి. వెహికిల్ చెకింగ్స్ వాహనదారులు,పోలీసుల మధ్య తలెత్తే వివాదాల్లో తప్పు ఎవరు చేశారో గుర్తించడం కోసం ఈ కెమెరాలను పోలీసులు ధరించాలి. కానీ గత రెండేళ్లుగా పోలీసులు బాడీ వార్న్ కెమెరాలను వాడటం లేదు. అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో పోలీసులు చెప్పేది నమ్మేలా లేదని సిర్పూర్కర్ కమిషన్ సుప్రీం కోర్టుకు రిపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే... పోలీసులు బాడీ వార్న్ కెమెరాలను ధరించాలని సిర్పూర్కర్ కమిషన్ సిఫారసు చేయడంతో పోలీసుల బాడీ వార్న్ కెమెరాల వాడకం మరోసారి చర్చ నీయాంశంగా మారింది.
‘దిశ’ కేసులోని నలుగురు నిందితులను సేఫ్ హౌస్ నుంచి చటాన్ పల్లికి తీసుకెళ్లే వరకు పోలీసులు చూపించిన రికార్టులన్నీ తప్పని కమిషన్ పేర్కొంది. అంతమంది పోలీసులు ఉంటే వారి నుంచి నలుగురు నిందితులు ఆయుధాలు గుంజుకోవడం సాధ్యం కాదని తెలిపింది. ‘‘పోలీసులు చెప్తున్నది నమ్మేలా లేదు. నిందితులకు ఆయుధాలు వాడే పరిజ్ఞానం ఉన్నట్లు భావించటం లేదు. నిందితులు దాడి చేస్తే పోలీసులు గాయపడ్డట్లు, వారికి చికిత్స అందించినట్లు చెప్తున్న విషయాలు కూడా పూర్తిగా అవాస్తవం” అని నివేదికలో సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. వాడిన బుల్లెట్ల వివరాలు కూడా సరిగ్గా లేవని.. ఘటన స్థలం దగ్గర పోలీసులు ధ్రువీకరించిన ఆధారాలను కూడా భద్రపర్చలేదని తెలిపింది’. పోలీసులు బాడీ వార్న్ కెమెరాలు వాడితే ఎన్ కౌంటర్ జరిగిన ఘటన స్థలంలో ఏం జరిగిందో రికార్డ్ అయ్యేది. కానీ ఎన్ కౌంటర్ సమయంలో పోలీసులు బాడీ వార్న్ కెమెరాలు వాడలేదు.. ఈ నేపథ్యంలో పోలీసులు కెమెరాలు ధరించాలని సిర్పూర్కర్ కమిషన్ సిఫారసు చేసింది.
2015లో బాడీ వార్న్ కెమెరాలు ప్రారంభం
2015లో డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో వాటిని ప్రారంభించారు. గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు 150కి పైగా కెమెరాలు అందించారు. మొదట్లో బాడీ వార్న్ కెమెరాలు మంచి రిజల్ట్ ఇచ్చాయి. పబ్లిక్ ప్లేసెస్‌లో జనాలతో పోలీసుల బిహేవియర్‌ను స్పాట్లోనే రికార్డు చేసేవి. వీడియో ఫుటేజ్ పరిశీలించి ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకునేవారు. ఈ కెమెరాలను ట్రాఫిక్,లా అండ్ ఆర్డర్ పోలీసులు వినియోగించేవారు. వెహికిల్ చెకింగ్స్ వాహనదారులు,పోలీసుల మధ్య తలెత్తే వివాదాల్లో తప్పు ఎవరు చేశారో గుర్తించే వారు.
ఎవరూ ఎడిట్ చేయడానికి వీలుండదు
స్పాట్లో బాడీ వార్న్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో అంతా సెంట్రల్ సిస్టమ్ సర్వర్‌లో అప్‌లోడ్ అవుతుంది. దాన్ని ఎవరూ ఎడిట్ చేయడానికి వీలుండదు. పబ్లిక్ తో పోలీసుల బిహేవియర్ ను, తనిఖీలు జరిగే టైమ్‌లో న్యూసెన్స్ చేసే జనాల వీడియోలను నేరుగా అవి సర్వర్లోకి రికార్డ్ చేస్తాయి. ఆ విజువల్స్‌ను పరిశీలించి ఉన్నతాధికారులు తగిన యాక్షన్ తీసుకొనేవారు.
ఆధునిక టెక్నాలజీతో కెమెరాలు కొనుగోలు చేస్తం
అయితే ఈ విషయంపై V6 వెలుగు.. పోలీసు అధికారులను సంప్రదించగా కొంతకాలం బాగానే పనిచేసిన కెమెరాలు లైఫ్ టైమ్ ముగియడంతో మూలనపడ్డాయన్నారు. రానున్న రోజుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కెమెరాలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు