
న్యూఢిల్లీ, వెలుగు: తాను పోటీ చేస్తున్నది రాజకీయ పదవి కోసం కాదని.. రాజ్యాంగ పదవికి అని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. తన పోటీపై బీఆర్ఎస్, టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు.. తనకు మద్దతుగా ఓటు వేయడంపై పునరాలోచన చేయాలని సుదర్శన్ రెడ్డి కోరారు.
తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడికి పోయిందని? తెలంగాణ అస్థిత్వం ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. కాగా, సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అని.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కావడంతో ఆయనకు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ను కోరారు. కానీ, కేటీఆర్ యూరియా నెపంతో ఈ ప్రపోజల్స్‌ను తిరస్కరించడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. దీంతో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేణకులు భావిస్తున్నారు.