న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులు కానున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నవంబర్ 23న రిటైర్ కానున్న నేపథ్యంలో కొత్త సీజేఐ నియామక ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. తదుపరి సీజేఐ పేరును సిఫారసు చేయాలని ప్రస్తుత సీజేఐకి కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది.
నిబంధనల ప్రకారం సీజేఐ తర్వాత ఆ స్థానంలో సీనియర్ మోస్ట్ జడ్జిని నియమిస్తారు. ప్రస్తుతం జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టులో సీజేఐ గవాయ్ తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్నారు. నవంబర్ 24న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ సూర్యకాంత్.. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో ఉంటారు.
