ఎమ్మెల్యే చందర్‌‌తో మాకు సంబంధం లేదు

ఎమ్మెల్యే చందర్‌‌తో మాకు సంబంధం లేదు

గోదావరిఖని, వెలుగు: ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ఫ్యాక్టరీలో పని చేసిన కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగం పొందడం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో.. వారిని తీసుకుని నేరుగా తమ వద్దకు వస్తే బాధితులకు డబ్బులు ఇప్పించి న్యాయం చేస్తామని ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ మాజీ  కాంట్రాక్టర్‌‌ గోపగోని మోహన్‌‌ గౌడ్‌‌ ప్రకటించారు. శుక్రవారం ఎన్టీపీసీ ఏరియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మరో కాంట్రాక్టర్‌‌ గుండు రాజుతో కలిసి ఆయన మాట్లాడారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌తో తమకు సంబంధం లేదని, టీఆర్‌‌ఎస్‌‌ పార్టీలో తమకు సభ్యత్వం కూడా లేదని ప్రకటించారు. 

ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో 2021 ఫిబ్రవరిలో యూరియా ప్రొడక్షన్‌‌ స్టార్ట్‌‌ అయ్యే సమయంలో లోడింగ్‌‌, స్టిచ్చింగ్‌‌, ఇతర సెక్షన్లకు సంబంధించి సబ్‌‌ కాంట్రాక్టు తీసుకున్నామన్నారు. 260 మంది ప్రభావిత, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ లెటర్‌‌ ప్యాడ్‌‌తో వస్తే పనిలో పెట్టుకున్నామని, 120 మంది ఎఫ్‌సీఐ మాజీ కార్మికులు, 40 మంది ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ హెచ్‌‌ఆర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ వారు పంపించిన కార్మికులను తీసుకున్నామని చెప్పారు. వంద మంది వరకు వివిధ రాజకీయ, కార్మిక సంఘాలవారు పంపించారని, 160 మంది వరకు సబ్‌‌ కాంట్రాక్టర్లుగా తమ బంధువులు, ఇతర లీడర్లు పంపించిన వారిని పనిలో చేర్చుకున్నామని తెలిపారు. వారి నుంచి ఎవరు డబ్బులు తీసుకున్నారో తమకు తెలియదని, ఎవరికైనా డబ్బులు ఇస్తే వారిని వెంటబెట్టుకుని వస్తే తిరిగి ఇప్పించి న్యాయం చేస్తామన్నారు.