
సికింద్రాబాద్, వెలుగు: ‘‘కోర్టు, హాస్పిటల్, పోలీస్ స్టేషన్ కు ఎవరూ రావాలనుకోరు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బాధతోనే రావాల్సి వస్తుంది. అలా సమస్యతో కోర్టుకు వచ్చేవారి పట్ల న్యాయవాదులు బాధ్యతగా మెలగాలి” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు రెండో ఫేజ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సుభాష్ రెడ్డి, హైకోర్టు చీఫ్జస్టిస్చౌహాన్తో కలిసి జస్టిస్ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఫేజ్వన్ ను జస్టిస్ ఠాకూర్ ఆధ్వర్యంలో ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. భవనంలోని చాంబర్లు హైకోర్టు, సుప్రీంకోర్టు భవనాల చాంబర్ల కంటే బాగున్నాయన్నారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు సమస్యగా మారాయని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేస్తుందన్నారు. సమాజంలో న్యాయవాద వృత్తి గౌరవాన్ని పెంపొందించేలా న్యాయవాదుల పనితీరు ఉండాలన్నారు. కోర్టుకు వస్తున్న వారి పట్ల న్యాయవాదులు శ్రద్ధ వహించాలన్నారు. సుహృద్భావ వాతావరణంలో కేసులు పరిష్కరించాలనిచెప్పారు.