
నిఖత్ జరీన్, ఆకుల శ్రీజకు ఆర్థిక సాయం మంజూరు
న్యూఢిల్లీ: స్టార్ ఆర్చర్, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సహా ఏడుగురు ఇండియా కాంపౌండ్ ఆర్చర్లు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) కోర్ గ్రూప్‌కు ఎంపికయ్యారు. ఇటీవల లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీని అధికారికంగా చేర్చిన నేపథ్యంలో మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) బుధవారం జరిగిన తన 155వ సమావేశంలో ఈ ఏడుగురిని టాప్స్‌లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.
జ్యోతితో పాటు ప్రవీణ్ దియోతలే, అదితి స్వామి, అభిషేక్ వర్మ, పర్నీత్ కౌర్, ప్రియాన్ష్, ప్రథమేష్ జావ్కర్‌కు చాన్స్ ఇచ్చింది. ఇటీవల అమెరికాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో వీళ్లు సత్తా చాటారు. జ్యోతి సురేఖ మూడు గోల్డ్ మెడల్స్ నెగ్గింది. ఆదితి , పర్నీత్ తో కలిసి విమెన్స్ టీమ్ ఈవెంట్‌లో , అభిషేక్ వర్మతో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లతో పాటు వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణ పతకం గెలిచింది.
మరోవైపు మెన్స్ టీమ్ ఈవెంట్‌లో అభిషేక్, ప్రియాన్ష్, ప్రథమేష్ స్వర్ణం సాధించారు. ప్రియాన్ష్ వ్యక్తిగత రజతం గెలిచాడు. టాప్స్ కోర్ గ్రూప్ ఎంపికకు అర్హత ప్రమాణంగా అబ్బాయిలకు 9.77+, అమ్మాయిలకు 9.67+ ఎరో సగటు స్కోరును నిర్దేశించారు. అలాగే వరల్డ్ చాంపియన్‌షిప్ లేదా ఆసియా గేమ్స్‌లో పతకాలు గెలిచినవారికి ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు డబుల్ వరల్డ్ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్, టీటీ స్టార్ ఆకుల శ్రీజతో పాటు పలువురు అథ్లెట్లకు విదేశాల్లో కోచింగ్, ట్రెయినింగ్, ఈవెంట్లలో పాల్గొనేందుకు ఎంఓసీ ఆర్థిక సహాయం మంజూరు చేసింది.
మొత్తం 56 అథ్లెట్ల ప్రతిపాదనలను ఆమోదించి రూ. 4.37 కోట్ల ఆర్థిక సహాయం కేటాయించింది. నిఖత్ జరీన్ ఈ నెల 8 నుంచి 23 వరకు తాష్కెంట్‌లో ఉజ్బెకిస్తాన్ ఎలైట్ విమెన్స్ టీమ్‌తో 17 రోజుల ఇంటర్నేషనల్ ట్రెయినింగ్‌లో పాల్గొనడానికి ఆర్థిక సహాయం కోరగా.. ఎంఓసీ మంజూరు చేసింది. ఆకుల శ్రీజ-– మనిక బత్రా ఈ నెల 17–-25 తేదీల్లో దోహాలో జరిగే ఐటీటీఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అవసరమైన సహాయం కల్పించింది.