జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విద్యా విప్లవానికి నాంది పలికిన్రు: గడ్డం వంశీకృష్ణ

జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విద్యా విప్లవానికి నాంది పలికిన్రు: గడ్డం వంశీకృష్ణ
  • మహిళా విద్యాభివృద్దికి కృషి చేసిన సంఘ సంస్కర్తలు
  • కన్నెపల్లిలో సావిత్రిబాయి- జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ 
  • వేలాల గట్టు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎంపీ

కోల్​బెల్ట్/బెల్లంపల్లి/జైపూర్, వెలుగు: దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన మహనీయులు సావిత్రిబాయి, -జ్యోతిరావు పూలే దంపతులని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. బాల్య వివాహాలు, సతీసహగమనం వంటి దురాచారాలను అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేశారన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఎంపీ పర్యటించారు. ఈ సందర్భంగా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న స్వామి 16వ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వంశీకృష్ణ.. స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. 

కన్నెపల్లి మండల కేంద్రంలో సావిత్రిబాయి 195వ జయంతిని పురస్కరించుకొని సావిత్రిబాయి, -జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలను కలెక్టర్ కుమార్​దీపక్‌తో కలిసి ఆవిష్కరించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని, కన్నెపల్లి, నెన్నెల, తాండూరు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కొత్త సర్పంచులను సన్మానించారు. తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ ఈసా తల్లి ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు.

అంతకు ముందు ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. బాలిక విద్యతో కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మహిళలు చదువుకునేందుకు విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతి రోజున విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళల విద్య, దళితుల హక్కులు, సామాజిక సమానత్వం కోసం వారు చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమన్నారు. 

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళల సాధికారతకు పెద్ద పీట వేస్తోందని, అడ బిడ్డలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మాలి కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి, న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.  నేతకాని కుల సంఘం పేరులో స్పెల్లింగ్​మిస్టేక్ ఉందని తన దృష్టికి తీసుకొచ్చారని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం న్యాయ శాఖ మంత్రితో మాట్లాడినట్లు వెల్లడించారు.  

అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం.. 
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. గెలుపొందిన సర్పంచులు గ్రామాల్లో పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. 

మరోవైపు, చెన్నూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జైపూర్ మండలంలోని వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయ అభివృద్ధి కోసం తన ఎంపీ ల్యాడ్ నిధులను కేటాయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎంపీ పాల్గొని, భక్తులతో కలిసి భోజనం చేశారు. ఎంపీ వెంట డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, సర్పంచులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.