ఆదిలాబాద్ జిల్లా దళిత ఎమ్మెల్యేలను కేబినెట్‌‌లోకి తీసుకోవాలి : కె.బాలకృష్ణ

ఆదిలాబాద్ జిల్లా దళిత ఎమ్మెల్యేలను కేబినెట్‌‌లోకి తీసుకోవాలి : కె.బాలకృష్ణ
  • మాల సంఘాల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కె.బాలకృష్ణ విజ్ఞప్తి

ఖైరతాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎస్సీ శాసనసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మాల సంఘాల ఫోరం విజ్ఞప్తి చేసింది. శనివారం హైదరాబాద్‌‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో మాల సంఘాల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కె.బాలకృష్ణ, మాలల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు కణం కిషన్, ఎస్సీ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎస్.రాజవస్తాద్ మీడియాతో మాట్లాడారు. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాకు తొలి జాబితాలో మంత్రి పదవి దక్కలేదన్నారు.

మాల సామాజిక వర్గమంతా కాంగ్రెస్ వెంట నడిచి అభ్యర్థుల విజయానికి కృషి చేసిందని గుర్తుచేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌‌నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు మంత్రి పదవులు దక్కాయన్నారు. హైదరాబాద్‌‌కు 400 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ ఉందని, అలాంటి మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మంత్రివర్గంలో ఎస్సీ కులాలకు చోటు దక్కాలని కోరారు.

కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి మన్నె శ్రీరంగా, ఉపాధ్యక్షుడు బిట్ల వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.అంజలి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.రఘురాం తదితరులు పాల్గొన్నారు.