
- ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కె. వేణుగోపాల్
ముషీరాబాద్,వెలుగు: కేంద్రంలోని నాలుగు బీమా సంస్థలను విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ రీజియన్ 12వ జనరల్ బాడీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉండగా వీటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిసారి కేంద్రం వేజ్ రివిజన్ చేస్తున్న సమయంలో పెన్షన్ దారులను పరిగణలోకి తీసుకొని పెన్షన్ పెంచాలని సూచించారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గురుమూర్తి, జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ హైదరాబాద్ రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు బుచ్చిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారి వీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.