కొడంగల్ ను ఆదర్శంగా చేద్దాం..ఐదేండ్లలో నియోజకవర్గం అభివృద్ధి : చైర్మన్ వెంకట్​రెడ్డి

కొడంగల్ ను ఆదర్శంగా చేద్దాం..ఐదేండ్లలో నియోజకవర్గం అభివృద్ధి : చైర్మన్  వెంకట్​రెడ్డి
  •     ఈ ప్రాంత ప్రగతిపై సీఎం రేవంత్ ప్రత్యేక నజర్​
  •     కడా చైర్మన్  వెంకట్​రెడ్డి  వెల్లడి

కొడంగల్, వెలుగు : విద్య, వైద్యం, ఆరోగ్యంలో ప్రగతి సాధించేలా.. సరైన ఉపాధి అవకాశాలతో కొడంగల్ నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా  ‘కడా’(కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ) కార్యాచరణ ఉంటుందని  చైర్మన్  వెంకట్​రెడ్డి పేర్కొన్నారు. సత్వర అభివృద్ధి చెందేలా అధికారుల ఆలోచనలు కూడా గొప్పగా ఉండాలని సూచించారు.  శుక్రవారం మహిళా సమాఖ్యలో సమావేశం ఏర్పాటు చేసి మున్సిపాలిటీ ఫురోగతిపై సలహాలు, సూచనలు తీసుకుని మాట్లాడారు.

కొడంగల్​ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక నజర్ ​పెట్టారని తెలిపారు.  ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులు పర్యటించారని గుర్తుచేశారు. ఐదేండ్లలో జరిగే అభివృద్ధి భవిష్యత్​కు ఆదర్శంగా తీర్చిదిద్దేలా ఉండాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం కూడా ఉండాలని కోరారు. ప్రణాళికబద్ధంగాకొడంగల్​అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. 

పార్టీలకతీతంగా ప్రగతి సాధిద్దాం 

కుల, మతాలు, పార్టీలకతీతంగా కొడంగల్​లో ప్రగతి సాధిద్దామని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్​రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గం వెనకబాటుకు గురైనా ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యవంతులు, రేవంత్​ సీఎం కావడం కొడంగల్ ​ప్రజల అదృష్టమని పేర్కొన్నారు.  కొడంగల్​పట్టణ విస్తరణ చేసి, అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీల నిర్మాణం చేయాలని సూచించారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలని , యువత ఉపాధి అవకాశాలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ వర్సిటీ ఏర్పాటు, కొత్త పద్ధతుల్లో వ్యవసాయాన్ని పోత్సహించేందుకు వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందని వ్యక్తంచేశారు.

గత ప్రభుత్వం చేపట్టిన పనులకు విజిలెన్స్​ విచారణ జరిపించాలని ఎంపీపీ ముద్దప్ప డిమాండ్​ చేశారు. మున్సిపల్ చైర్మన్​జగదీశ్వర్​రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన  సమావేశంలో కమిషనర్​ ప్రవీణ్​కుమార్​రెడ్డి, ఏఈ రాకేశ్​రెడ్డి, వైస్​ చైర్మన్ ఉషారాణి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్​, పీసీసీ మెంబర్​ యూసుఫ్,​పున్నం చంద్, మోహన్​రావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

రూ. 120 కోట్లతో యాక్షన్ ప్లాన్  

కొడంగల్​ మున్సిపల్​ అభివృద్ధికి రూ.120తో అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇందులో తాగునీటికి రూ.4.5 కోట్లు, మురుగు నీటి వ్యవస్థకు రూ. 36.70 కోట్లు, పట్టణ క్రీడా ప్రాంగణానికి రూ. 1.25 కోట్లు, ఇండోర్​ స్టేడియానికి రూ. 4 కోట్లు, బుల్కాపూర్​ రోడ్, డంప్ ​యార్డుకు రూ. 5.5 కోట్లు, మున్సిపల్ ​బిల్డింగ్​కు అదనంగా రూ. 3 కోట్లు, పెద్ద చెరువు కట్ట డెవలప్​మెంట్​కు రూ.9.31 కోట్లు, అంబేద్కర్​ సర్కిల్​కు రూ. కోటి, పార్కుకు రూ. 2కోట్లతో ప్రపోజల్స్ సిద్ధం చేశారు.