రాజమౌళి స్టూడెంట్ నెం.1 స్టోరీని నిజం చేసిన కడప ఖైదీ..!

రాజమౌళి స్టూడెంట్ నెం.1 స్టోరీని నిజం చేసిన కడప ఖైదీ..!

కడప: దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా గుర్తుందా..? పరిస్థితుల ప్రభావం వల్ల హత్య చేసి.. జైలు నుంచి కాలేజ్కు వెళ్లి చదువుకుంటూ ప్రయోజకుడు అయిన ఒక కుర్రాడి కథే ఈ సినిమా. ఈ సినిమా తరహాలోనే రియల్ లైఫ్లో కూడా జైలు జీవితం గడిపిన ఒక యువకుడు కష్టపడి చదువుకుని ప్రయోజకుడిగా మారాడు. జైలు నుంచే చదువు కొనసాగించిన ఈ కుర్రాడు స్టూడెంట్ నంబర్ 1 అనిపించుకున్నాడు. జీవితంలో తప్పులు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం కొందరికే వస్తుంది. అలా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారిలో యుగంధర్ ఒకడు.

హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీ గోల్డ్ మెడల్ సాధించాడు. ఏపీలోని కడప జైలులోని యుగంధర్ అనే ఖైదీ ఈ ఘనత సాధించాడు. తిరుపతికి చెందిన యుగంధర్ జైలు నుంచే ఉన్నత చదువులు పూర్తి చేశాడు. 2011లో ఓ హత్య కేసులో అతడికి జీవిత ఖైదు పడింది. చేసిన తప్పుకు కొన్నేళ్లు తీవ్రంగా పశ్చాతాపం చెందాడు. హంతకుడు అనే ముద్ర చెరిపేసుకుని ప్రయోజకుడు కావాలనుకున్నాడు.

►ALSO READ | తిరుమల లడ్డు కేసుపై సిట్ దర్యాప్తు ఆగిపోయిందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

కడప జైల్లో శిక్ష అనుభవిస్తూనే దూర విద్య విధానంలో కష్టపడి చదువుకున్నాడు. దూర విద్య ద్వారా 4 BAలు, 3 MAలు పూర్తి చేశాడు. తాజాగా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీలో B.A పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. తెలిసోతెలియకో చేసిన తప్పుకు జైలులో మగ్గిపోతున్న ఎంతో మంది ఖైదీల్లో స్ఫూర్తి నింపాడు. చదువుతో జీవితాన్నే నిర్మించుకోవడమే కాదు చేదు గతాన్ని కూడా చెరిపేసుకోవచ్చని నిరూపించాడు. సత్ప్రవర్తనతో ఉంటూ జైలు అధికారుల నుంచి ప్రశంసలు పొందాడు. సత్ప్రవర్తనతో మనిషిగా మారిన యుగంధర్ను విడుదల చేయాలని అతని తల్లి చెంగమ్మ కోరుకుంటుంది.