ఓరుగల్లులో సీన్​ రివర్స్​ .. ఇప్పడు నెంబర్స్​తారుమారు

ఓరుగల్లులో సీన్​ రివర్స్​ .. ఇప్పడు నెంబర్స్​తారుమారు
  • గతంలో బీఆర్ఎస్​కు 11.. కాంగ్రెస్​కు ఒక్క ఎమ్మెల్యే
  • నాడు కాంగ్రెస్‍ నుంచి గెలిచిన గండ్ర బీఆర్ఎస్​లోకి జంప్‍
  • నేడు బీఆర్‍ఎస్‍ నుంచి గెలిచిన కడియం హస్తం పార్టీలోకి
  • ఉమ్మడి జిల్లాలో కారు పార్టీలో మిగిలింది పల్లానే

వరంగల్‍, వెలుగు: ఓడలు బండ్లవుతాయన్న చందంగా తయారైంది బీఆర్ఎస్​ పరిస్థితి. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీకి ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్​కు ఒక్క ఎమ్మెల్యేనే ఉండేవారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్​విక్టరీ కొట్టింది. తాజాగా కడియం శ్రీహరి కాంగ్రెస్​లో చేరడంతో జిల్లాలో ఆ పార్టీ బలం 11కు చేరింది. బీఆర్ఎస్​కు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి ఒక్కరే మిగిలారు.

2018లో అలా.. 2023లో ఇలా..

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని 12 స్థానాల్లో అత్యధికంగా 10 చోట్ల బీఆర్‍ఎస్‍  పార్టీ  విజయం సాధించింది. హస్తం పార్టీలో ములుగు నుంచి ధనసరి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి మాత్రమే గెలుపొందారు. మిగతా 10 స్థానాలైన వరంగల్‍ తూర్పు నుంచి నన్నపునేని నరేందర్‍, పశ్చిమ నుంచి దాస్యం వినయ్‍ భాస్కర్‍, పరకాల చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట పెద్ది సుదర్శన్‍రెడ్డి, వర్దన్నపేట నుంచి ఆరూరి రమేశ్‍, ములుగు తాటికొండ రాజయ్య, జనగామ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‍రావు, మహబూబాబాద్‍ శంకర్‍నాయక్‍, డోర్నకల్‍ అసెంబ్లీ నుంచి రెడ్యానాయక్‍ బీఆర్‍ఎస్‍ టికెట్​పై ఎమ్మెల్యేలుగా గెలిచారు.

2023లో సీన్‍ రివర్స్​కావడంతో బీఆర్‍ఎస్‍ నుంచి జనగామలో పల్లా రాజేశ్వర్‍రెడ్డి, స్టేషన్‍ ఘన్‍పూర్‍లో కడియం శ్రీహరి మాత్రమే గెలుపొందారు. మిగతా 10 స్థానాలైన వరంగల్‍ తూర్పులో కొండా సురేఖ, పశ్చిమలో నాయిని రాజేందర్‍రెడ్డి, పరకాల రేవూరి ప్రకాశ్‍రెడ్డి, నర్సంపేట దొంతి మాధవ్​రెడ్డి, వర్దన్నపేట కేఆర్‍.నాగరాజు, మహబూబాబాద్‍ మురళీ నాయక్‍, డోర్నకల్ రామచంద్రు నాయక్‍, ములుగు సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ రూపంలో హస్తం పార్టీ నుంచి గెలిచి సత్తా చాటారు.

అప్పుడు గండ్ర.. ఇప్పుడు కడియం

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‍ టికెట్​పై పోటీ చేసి భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్​ పార్టీ నుంచి అప్పటి అధికార బీఆర్‍ఎస్‍లో లో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సీతక్క ఒక్కరే హస్తం పార్టీలో మిగిలారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‍ ఘన్‍పూర్‍ నుంచి కడియం శ్రీహరి, జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‍రెడ్డి మాత్రమే బీఆర్‍ఎస్‍ నుంచి గెలవగా.. ఎవరూ ఊహించని రీతిలో కడియం శ్రీహరి కాంగ్రెస్‍ కండువా కప్పుకున్నారు.