కల్వకుంట్ల కుటుంబంలో కాళేశ్వరం కల్లోలం : కడియం శ్రీహరి

కల్వకుంట్ల కుటుంబంలో కాళేశ్వరం కల్లోలం : కడియం శ్రీహరి
  • అక్రమ ఆస్తుల పంపకాల్లో తేడాతోనే పంచాయితీ
  • స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్

జనగామ, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతే కల్వకుంట్ల కుటుంబంలో కల్లోలానికి కారణమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్​ ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు, ధరణి పోర్టల్ ద్వారా సంపాదించిన వందల ఎకరాల అక్రమ ఆస్తుల పంపకాల పంచాయితీ వల్లే కేసీఆర్​ కుటుంబంలో గొడవలు తలెత్తాయని తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డితో కలిసి లింగాల ఘన్​పూర్​ మండలం నవాబుపేట రిజర్వాయర్​నుంచి దేవాదుల నీటిని విడుదల చేశారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు. కేసీఆర్​ఫ్యామిలీ తెలంగాణ వనరులను దోచుకుందని   ఆరోపించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నదే కాంగ్రెస్​ ప్రభుత్వ పాలసీ అని అన్నారు. అందుకే దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రూ 1,015 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.

 తొలిసారి నవాబుపేట రిజర్వాయర్​ కాల్వల ద్వారా సాగు నీరు విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. లింగాల ఘనపూర్​, దేవరుప్పుల, గుండాల మండలాల్లో 43 వేల ఎకరాలకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధీర్, అధికారులు, కాంగ్రెస్​లీడర్లు, రైతులు పాల్గొన్నారు.