
- క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే మా తపన: వినోద్
- కాకా చూపిన మార్గంలో నడుస్తున్నం: సరోజా వివేక్
- కాలేజీలో ఫ్యాకల్టీ, స్టూడెంట్ల సంబురాలు
- హాజరైన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
ముషీరాబాద్, వెలుగు:కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలకు యూనివర్సిటీ గుర్తింపు రావాలని కాకా వెంకటస్వామి ఆకాంక్షించారని చెన్నూరు ఎమ్మెల్యే, విద్యాసంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఇప్పుడు అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా రావడంతో కాకా కల నెరవేరిందని అన్నారు. డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా రావడం హర్షణీయమని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి యూజీసీ అటానమస్ హోదా లభించిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని కాలేజీ ఆవరణలో ఫ్యాకల్టీ, స్టూడెంట్లు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తన తండ్రి కాకా వెంకటస్వామి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో 1973లో ఈ విద్యాసంస్థలను పెట్టారని గుర్తు చేశారు.
‘‘బడుగు బలహీన వర్గాలు, పేద విద్యార్థులకు మంచి చదువు అందించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. స్టూడెంట్లకు అవసరమైన అన్ని సౌలతులు కల్పించాం. మా ఫ్యాకల్టీ కృషితో గొప్ప విజయం సాధించాం. ప్రతి పరీక్షలోనూ మా విద్యాసంస్థల నుంచి రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్స్ వస్తున్నాయి. ఇందులో ఫ్యాకల్టీ పాత్ర ఎంతో ఉంది. అంబేద్కర్ కాలేజీలో చదివిన విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగారు. దానికి కారణం ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే” అని అన్నారు.
ప్రపంచంతో పోటీ పడేలా..: వినోద్
తాము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకేతపిస్తున్నామని బెల్లంపల్లి ఎమ్మెల్యే, అంబేద్కర్ విద్యాసంస్థలసెక్రటరీ వినోద్ తెలిపారు.ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నామన్నారు.
క్వాలిటీ ఎడ్యుకేషన్: ప్రొఫెసర్ లింబాద్రి
అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా రావడం ఆనందంగా ఉందని అంబేద్కర్ విద్యాసంస్థలసీఈవో ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. తమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని చెప్పారు.
కేక్ కట్ చేసి సంబురాలు..
అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా వచ్చిన సందర్భంగా ఫ్యాకల్టీ, స్టూడెంట్లు సంబురాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి సందడి చేశారు. వేడుకలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ హాజరై స్టాఫ్‌కు అభినందనలు తెలిపారు. అంబేద్కర్ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ రమణకుమార్, విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, సిబ్బంది పాల్గొన్నారు.
అంచెలంచెలుగా ఎదుగుతున్నం: సరోజా వివేక్
అంబేద్కర్ డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా రావడం ఆనందంగా ఉందని అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ అన్నారు. ‘‘బడుగు బలహీన వర్గాలకు ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో 1973లో అంబేద్కర్ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఇతర సదుపాయాలు కల్పిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాం. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న తరుణంలో డిగ్రీ కాలేజీకి అటానమస్ హోదా రావడం గర్వకారణం. కాకా వెంకటస్వామి చూపించిన మార్గంలోనే మేమంతా నడుస్తున్నాం. మా విద్యార్థులు చాలామంది స్టేట్ర్యాంక్స్, గోల్డ్‌మెడల్స్ సాధిస్తున్నారు” అని చెప్పారు. త్వరలోనే తమ విద్యాసంస్థ మంచి యూనివర్సిటీగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.