తెలంగాణ ‘దిల్​ కా తుక్డా’

తెలంగాణ ‘దిల్​ కా తుక్డా’

ఏక్ దిల్  కే తుక్డే హజార్ హువే.. ఏక్ యహన్ గిరా.. ఏక్ వహన్ గిరా.. అని ‘ప్యార్ కి జీత్’ అనే చాలా  పాత చిత్రంలోని మొహమ్మద్ రఫీ పాడిన పాటను కాకా గడ్డం వెంకటస్వామి పదే పదే పాడే వారు. ఆయనలో కవి, సంగీత ప్రియుడు కనిపించేవాడు. కాకా నిజంగానే తెలంగాణకా దిల్ కా తుక్ డా అనడం అతిశయోక్తి కాదు. ఆయన చాలా ప్రేమ గల మనిషి, నిబద్ధత ఉన్న సీరియస్ లీడర్ కూడా.  కాకా వ్యక్తిత్వం మానవత్వం. అందుకే ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. వెంకటస్వామి1929 అక్టోబర్​5న గడ్డం మల్లయ్య, పెంటమ్మలకు జన్మించారు. తండ్రి మల్లయ్య నిజాం సైన్యంలో జవాన్​గా పనిచేసేవారు. 1945లో హైదరాబాద్​ స్టేట్ ​యూత్ ​కాంగ్రెస్​గా జనరల్ ​సెక్రటరీగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన వెంకటస్వామి..  ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా పేద ప్రజల కోసం విశేషంగా పనిచేశారు. ఆయన ఎన్నడూ నేల విడిచి సాము చేయలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన తొలి, మలి దశల ఉద్యమాలో ఆయన పాత్రను విస్మరించలేం. స్థిరమైన రాజకీయాలకు, నమ్మిన సిద్ధాంతానికి భిన్నంగా ఆయన ఎన్నడూ వ్యవహరించలేదు. నిత్యం పేదోడి కోసం, వారి హక్కుల కోసం తపించారు. ఆయన ఎంత ఎదిగినా, ఒదిగే ఉన్నారు. సామాన్యులు సైతం ఎవరి ప్రమేయం లేకుండా ఆయనను నేరుగా కలుసుకునేవారు. నేను ఒక జర్నలిస్ట్ గా, మనిషిగా ఆయనను చాలా దగ్గరగా చూశాను. ప్రజలే ఊపిరిగా బతికాడు కాకా. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పని చేసినా సామాన్యుడిలా ఉండేవారు. 

కార్మికుల కోసం కృషి
ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీ అయినా, విపక్షంలో ఉన్నా పోలీసులు, నక్సలైట్ల పేరిట అమాయకులను రాత్రికి రాత్రి ఇంటి నుంచి తీసుకెళ్లి, మాయం చేసి కాల్చి చంపిన సందర్భాల్లో వెంకటస్వామి వాటిని తీవ్రంగా ఖండించారు. వాటిని ఆపాలని అప్పటి సీఎం వైస్సార్ ను కోరారు. ఎలాంటి శశబిషలు లేకుండా ఎన్​కౌంటర్ బాధిత కుటుంబాల ఇండ్లకు వెళ్లి పరామర్శించేవారు. కాకా తర్వాత ఆయన చిన్న కొడుకు గడ్డం వివేక్  వెంకటస్వామి తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. కాకా జీవిత చరిత్రను ప్రముఖ రచయిత పి.చందు ‘మేరా సఫర్’లో చక్కగా రాశారు. అందరూ దాన్ని తప్పక చదవాలి. 
-ఎండీ మునీర్,సీనియర్ జర్నలిస్ట్