
- 1982లో ఐక్యరాజ్యసమితిలో
- కార్మికుల సమస్యలపై మాట్లాడిన కాకా
- 43 ఏండ్ల తర్వాత ఆర్థిక విధానం,
- అభివృద్ధి అంశాలపై మాట్లాడిన వంశీ
హైదరాబాద్/గోదావరిఖని, వెలుగు: ఐక్యరాజ్యసమితి వేదికపై మన రాష్ట్రం నుంచి తాతామనవళ్లు అరుదైన ముద్ర వేశారు. వారిద్దరూ కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, ఆయన మనుమడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దాదాపు 43 ఏండ్ల కింద కాకా వెంకటస్వామి ఇండియా ప్రతినిధిగా జెనీవాలో ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన మనుమడు వంశీకృష్ణ భారత యువ ఎంపీల బృందంలో భాగంగా న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనడం విశేషం. కార్మిక నేతగా ఎదిగిన కాకా ఐఎల్‌వో మీటింగ్‌లో కార్మికుల సమస్యలపై గళం వినిపిస్తే.. యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన మనుమడు ఆర్థిక విధానాలు, దేశాల మధ్య సంబంధాలు, కలిసి ఎదగడం అనే అంశాలపై మాట్లాడి ఆకట్టుకున్నారు. అప్పటి తరానికి ప్రతినిధిగా కార్మిక అంశాలపై కాకా వెంకటస్వామి అంతర్జాతీయ వేదికపై గళం వినిపిస్తే.. ఇప్పటి తరానికి ప్రతినిధిగా ప్రపంచ పరిస్థితులు, ఆర్థిక విధానాలపై ఆయన మనుమడు వంశీకృష్ణ ప్రసంగించారు. ఇక కాకా వారసుడిగా ఎదిగిన వివేక్ వెంకటస్వామి.. ప్రస్తుతం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.
కార్మిక నేత.. కాకా
కార్మిక రంగం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నేత గడ్డం వెంకటస్వామిని కార్మికులు కాకా అని పిలచుకునేవారు. తెలంగాణ స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం దాకా కీలకపాత్ర పోషించిన కాకా.. కార్మిక సంఘాల నేతగా, పేదల నాయకుడిగా ప్రత్యేకమైన ముద్ర వేశారు. కార్మిక హక్కులు, కనీస వేతనాలు, కంపెనీల్లో సౌకర్యాలపై ఆయన చేసిన పోరాటాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. అప్పట్లోనే ఒకసారి జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంఘం సమావేశాల్లో ప్రతినిధి బృందంలో సభ్యుడిగా పాల్గొన్నారు. కేంద్రంలో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి కూడా కాకాపై ప్రత్యేకమైన గౌరవం ఉండేది. 1982లో రాష్ట్రంలో టి.అంజయ్య కేబినెట్లోకాకా మంత్రిగా ఉన్నారు. కార్మిక రంగంలో వెంకటస్వామికి ఉన్న అనుభవాన్ని గుర్తించిన ఇందిరాగాంధీ.. ఆయనను జెనీవాలో అంతర్జాతయ కార్మిక సంస్థ సమావేశాలకు భారత ప్రతినిధిగా పంపించాలని నిర్ణయించారు.
రాష్ట్ర మంత్రిగా ఉన్నా కూడా ఆయన అనుభవానికి, పోరాటాలకు ఈ గౌరవం దక్కింది. ఇట్లా భారత ప్రతినిధుల నాయకుడిగా జెనీవా వెళ్లిన కాకా.. అక్కడ కార్మిక హక్కులపై తనదైన గళం వినిపించారు. దేశంలో కార్మిక సంక్షేమ చట్టాలపై వివరించారు. ఈ సమావేశాల్లోనే వృద్ధ కార్మికుల సమస్యలు, పురుష, మహిళా కార్మికులకు సమాన అవకాశాల లాంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.
ఇందులోనే వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యంపై చరిత్రాత్మక కన్వెన్షన్ ను ఆమోదించారు. దానిని అదే ఏడాది నుంచి మనదేశంలో అమల్లోకి తెచ్చారు. కార్మిక రంగంలో కింది స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక దాకా ఎదిగిన కాకా.. అదే అనుభవంతో 1990ల్లో ప్రైవేటు రంగంలో కార్మికులు, ఉద్యోగులకు పెన్షన్ స్కీం ఆలోచన చేశారు. అలా వచ్చిన చట్టమే కోట్ల మంది కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత ఆసరాగా మారింది.
యువ పారిశ్రామికవేత్త.. వంశీకృష్ణ
దాదాపు 43 ఏండ్ల తర్వాత కాకా మనుమడు గడ్డం వంశీకృష్ణ న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికపై మాట్లాడారు. విశాక ఇండస్ట్రీస్ జేఎండీగా యువ పారిశ్రామికవేత్తగా, ఆవిష్కర్తగా గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ.. తాత, తండ్రి బాటలోనే పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. కార్మిక సమస్యలు, ప్రధానంగా సింగరేణి అంశాలపై గళం వినిపిస్తున్నారు. పార్లమెంటుకు కార్మికుల యూనిఫాంలో హాజరై ఆకట్టుకున్నారు. ఇప్పుడు భారత ప్రతినిధి టీమ్‌లో భాగంగా న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించారు.
ప్రపంచ దేశాలన్నీ పరస్పర సహకారంతో ఎదగాలన్నదే భారతదేశ ఆలోచనా విధానమని చెప్పారు. సూక్ష్మ ఆర్థిక విధానం, అభివృద్ధికి రుణాలు అనే అంశంపై చర్చలో వంశీకృష్ణ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం పెరుగుతున్న సమయంలో సమగ్రమైన అభివృద్ధికి ఇంజిన్‌లా పనిచేసేలా ప్రపంచ వాణిజ్య విధానాలు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పారదర్శకంగా, అందరికీ మేలుచేసేలా ఉండే సమగ్ర వాణిజ్య వ్యవస్థకే భారత్ మద్దతిస్తుందని చెప్పారు. ఈ దిశగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుక ప్రపంచ వేదికలపై వినిపించాలని చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఆధ్వర్యంలో అంతర్జాతీయ వ్యాపార నియమాలకు దేశాలన్నీ కట్టుబడి ఉండాలని సూచించారు. సమగ్ర అభివృద్ధి సాధించాలంటే పెట్టుబడులను వేగంగా సమీకరించుకునే వెసులుబాటు రావాలని ఆకాంక్షించారు.