ఎల్ఎల్ఎం, ఎల్ఎల్​బీ స్టూడెంట్లకు పట్టాల ప్రదానం

ఎల్ఎల్ఎం, ఎల్ఎల్​బీ స్టూడెంట్లకు పట్టాల ప్రదానం
  • లా.. ఆర్డినరీ డిగ్రీ కాదు: గాలి వినోద్ కుమార్
  • లాయర్లకు రిటైర్​మెంట్ ఉండదు: జస్టిస్ రామలింగేశ్వర రావు 

ముషీరాబాద్, వెలుగు: కాకాస్ అంబేద్కర్ లా కాలేజీ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని కాలేజీలో జరిగిన వేడుకలో 2022లో ఎల్ఎల్ఎం, ఎల్ఎల్‌‌బీ పూర్తి చేసిన స్టూడెంట్లకు పట్టాలు ప్రదానం చేశారు. ఎల్ఎల్​ఎంలో 20 మందికి, ఎల్ఎల్​బీ త్రీ ఇయర్స్ కోర్సులో 156 మందికి, ఫైవ్ ఇయర్స్ కోర్సులో 60 మందికి పట్టాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ డీన్ గాలి వినోద్ కుమార్, రిటైర్డ్ జడ్జి జస్టిస్ రామలింగేశ్వర రావు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ అడ్వొకేట్ రాంచందర్ రావు, అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేకానంద్​ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేశారు. లా చదువు ఆర్డినరీ డిగ్రీ కాదని.. సొసైటీని కాపాడేదని వినోద్ కుమార్ అన్నారు. లిబరేషన్ ను కాపాడేది లాయర్లేనని చెప్పారు. కొత్త తరం లాయర్లు డబ్బు వెనక పడకుండా, సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా, ఇంకా సమానత్వం రాలేదని.. ఇప్పటికీ 85% మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్లకు రిటైర్ మెంట్ అంటూ ఉండదని, చివరి వరకూ సేవ చేస్తుంటారని జస్టిస్ రామలింగేశ్వర రావు అన్నారు. యువ లాయర్లు కొత్త చట్టాలు చదువుతూ, పాత చట్టాలను అవగాహన చేసుకోవాలన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించాలన్నారు. 

సౌలతులు బాగున్నయ్: రాంచందర్ రావు ఎన్నో లా కాలేజీలను తాను సందర్శించానని.. కానీ అంబేద్కర్ కాలేజీలో ఉన్న సౌలతులు ఎక్కడా లేవని రాంచందర్ రావు అన్నారు. ఈ కాలేజీ దేశంలోని టాప్ కాలేజీల లిస్టులో ఉందని చెప్పారు. ప్రస్తుతం లా కోర్సుకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. మన దేశంలో ఉన్నంత మంది లాయర్లు ఎక్కడా లేరన్నారు. కాగా, పట్టాలు పొందిన విద్యార్థులు ఆనందంతో సందడి చేశారు. తమ తల్లిదండ్రులతో సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీ రమణకుమార్, డైరెక్టర్ రామకృష్ణ మోహన్ రావు, లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు.

గర్వంగా ఉంది.. 

అంబేద్కర్ కాలేజీలో చదివినందుకు గర్వంగా ఉంది. మా అమ్మ భాగ్యలక్ష్మితో కలిసి కోర్సు పూర్తి చేయడం మరింత ఆనందంగా ఉంది. మేమిద్దరం క్లాస్ మేట్స్ గా ఉండటం చూసి అందరూ షాక్ అయ్యేవారు. ఇప్పుడు ఇద్దరం ఎల్ఎల్ బీ పూర్తి చేసి, ఒకేరోజు పట్టాలు పొందడం ఎక్కడా లేని సంతోషాన్ని ఇచ్చింది. 

- నైనా జైస్వాల్, 
టేబుల్ టెన్నిస్ ప్లేయర్

మేం ముగ్గురం ఇక్కడే చదివాం 

అంబేద్కర్ కాలేజీ మాకు మంచి అవకాశం ఇచ్చింది. ఇదే కాలేజీలో నేను, నా భార్య శాంతి లా చదివాం. ఇప్పుడు మా కొడుకు గురుదత్త లా కోర్సు పూర్తిac చేశాడు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురం పట్టాలు అందుకోవడం సంతోషంగా ఉంది. కరస్పాండెంట్ సరోజా వివేకానంద్​ ఎంతోమందిని ప్రోత్సహిస్తూ కాలేజీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. 

- బాలాజీ, 
అంబేద్కర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్