Sai Pallavi: సీఎం స్టాలిన్‌ చేతుల మీదుగా ‘కలైమామణి’ పురస్కారం అందుకున్న నటి సాయిపల్లవి

Sai Pallavi: సీఎం స్టాలిన్‌ చేతుల మీదుగా ‘కలైమామణి’ పురస్కారం అందుకున్న నటి సాయిపల్లవి

తమిళనాడులో అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ‘కలైమామణి’ (Kalaimamani Awards) అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేసింది. శనివారం సాయంత్రం (2025 అక్టోబర్ 11న) చెన్నైలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 90 మందికి పురస్కారాలు అందజేసింది ప్రభుత్వం.

ఈ సందర్భంగా 2021కిగాను నటనా విభాగంలో ప్రముఖ మలయాళ నటి సాయిపల్లవి, తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్‌ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అలాగే, నటులు ఎస్‌.జే. సూర్య, అనిరుధ్ రవిచందర్, విక్రమ్‌ ప్రభు తదితరులు కూడా పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.

సినీ, కళా,సాహిత్య రంగాల్లో కృషి చేసిన ప్రముఖులను ప్రభుత్వం గుర్తించి సత్కరించింది. అయితే, గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను ఒకేసారి ఈ అవార్డును గ్రహీతలకు అందజేశారు. ఈ పురస్కారాల ద్వారా కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, హీరో ఉదయనిధి స్టాలిన్ తో పాటుగా ప్రముఖ సినీ, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. 

అవార్డు గ్రహీతలు వీరే:

సంవత్సరం    అవార్డు గ్రహీతలు

2021  -  నటి సాయి పల్లవి, దర్శకుడు, -నటుడు ఎస్.జె. సూర్య, దర్శకుడు ఎన్. లింగుసామి, రచయిత కె. తిరునావుక్కరసు, కవి నెల్లై జయంత.
2022  -  నటుడు విక్రమ్ ప్రభు, రచయిత్రి శాంతకుమారి శివకాదచ్చం.
2023  -  సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్, నటులు కె. మణికందన్, ఎం. జార్జ్ మారియన్, నేపథ్య గాయని శ్వేతా మోహన్, కొరియోగ్రాఫర్ శాండీ.

వీరితో పాటు సాహిత్యం, నాటక రంగాలకు చెందిన అనేక మంది ప్రతిభావంతులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

అత్యున్నత కళా గౌరవం:

తమిళనాడులో కళాకారులకు దక్కే అత్యున్నత గౌరవంగా ఈ అవార్డును పరిగణిస్తారు. 1954లో తమిళనాడు ఈశై నాటక మండలి ద్వారా ఈ అవార్డును ప్రారంభించారు. గతంలో కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వైజయంతీమాలా వంటి దిగ్గజాలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అయితే, కలైమామణి అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బంగారు పతకం (గోల్డ్ మెడల్), ఒక షీల్డ్ బహూకరిస్తారు. మొత్తానికి ఈ అవార్డులు కోలీవుడ్ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.