
- సరస్వతీ పుష్కరాలకు భారీగా తరలివచ్చిన భక్తులు
- కిటకిటలాడుతున్న కాళేశ్వరం ఆలయం, పుష్కరఘాట్లు
జయశంకర్ భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్/మహదేవపూర్, వెలుగు : సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులతో కాళేశ్వరం కిటకిటలాడుతోంది. సోమవారం సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పుష్కరస్నానాలు చేశారు. ఎండవేడి, ట్రాఫిక్ సమస్య కారణంగా రెండు రోజులు ఇబ్బంది పడిన భక్తులు సోమవారం తెల్లవారుజామునే కాళేశ్వరం చేరుకున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నది పరిసర ప్రాంతాలు, పుష్కర ఘాట్లు, ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ రాకతో ఉదయం ఐదు గంటల వరకే పార్కింగ్ ప్లేస్‌లన్నీ నిండిపోయాయి. భక్తులు పుష్కరస్నానాలు ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్నారు. సింగరేణి సంస్థ సహకారంతో స్టాళ్లు ఏర్పాటు చేసి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.