
- 3 వాల్యూమ్‌లుగా 650 పేజీలతో తుది నివేదిక
- కమిషన్ చైర్మన్ నుంచి రిపోర్టు తీసుకొని సీఎస్‌కు అందజేసిన ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా
- నేడు సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- నివేదికపై కేబినెట్‌లో చర్చించి, ఏజీకి పంపే చాన్స్.. ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టే అవకాశం
- ప్రాజెక్టులో అవకతవకలపై పోయినేడు మార్చి 13న జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు
- 17 నెలల పాటు 115 మంది ఆఫీసర్లు, లీడర్ల విచారణ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తయింది. 17 నెలల పాటు విచారణను కొనసాగించిన కమిషన్.. గురువారం తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై మూడు వాల్యూమ్‌లుగా దాదాపు 650 పేజీలతో నివేదికను కమిషన్ తయారు చేసింది. ఆ నివేదికను సీల్డ్కవర్లో పెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయానికి వచ్చిన ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా.. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్‌తో అరగంట పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత చైర్మన్ నుంచి నివేదికను తీసుకుని.. నేరుగా సెక్రటేరియెట్‌కు వెళ్లి, ఆ రిపోర్టును సీఎస్ రామకృష్ణారావుకు అందజేశారు. నివేదిక వచ్చిన సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియజేసిన సీఎస్.. ఆ రిపోర్టును లాకర్‌లో భద్రపరిచారు. దీన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్‌కు మంత్రి ఉత్తమ్ అందజేయనున్నారు. సీల్డ్కవర్లో ఉన్న ఆ నివేదికను కేబినెట్‌లో పెట్టి చర్చించే ముందే ప్రభుత్వం ఓపెన్ చేయనున్నట్టు సమాచారం. కేబినెట్‌లో చర్చించాక రిపోర్టును ప్రభుత్వం న్యాయపరమైన సలహా కోసం అడ్వొకేట్ జనరల్‌కు పంపనుందని తెలిసింది. లీగల్ఒపీనియన్వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టి చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.
మార్చి 13న కమిషన్ ఏర్పాటు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్21న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడ్డాక మూడు బ్యారేజీలపై విజిలెన్స్విచారణకు ఆదేశించింది. నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)తో విచారణ జరిపించింది. ఇప్పటికే విజిలెన్స్, ఎన్డీఎస్ఏ తుది నివేదికలు ఇచ్చాయి. అయితే 2024 ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. మేడిగడ్డ కుంగుబాటుపై జ్యుడీషియల్ కమిషన్‌ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదే ఏడాది మార్చి 13న సుప్రీంకోర్టు రిటైర్డ్‌జడ్జి జస్టిస్పీసీ ఘోష్ చైర్మన్‌గా జ్యుడీషియల్‌కమిషన్ ఏర్పాటు చేసింది. జూన్చివరి నాటికి రిపోర్టు ఇచ్చేలా కమిషన్‌కు గడువు ఇచ్చింది.
అయితే, కమిషన్ తన విచారణను జూన్ చివరి వారం నుంచి ప్రారంభించింది. విచారణ ప్రాథమిక దశలోనే ఉండడంతో తొలిసారిగా గడువును ఆగస్టు 30 వరకు పొడిగిస్తూ జూన్29న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పటికీ విచారణ పూర్తికాకపోవడం.. అధికారుల అఫిడవిట్లు సమర్పణ దగ్గరే ఉండడంతో ఆ గడువు సరిపోలేదు. దీంతో రెండోసారి అక్టోబర్31 వరకు గడువును పొడిగిస్తూ ఆగస్టు 28న ఉత్తర్వులు ఇచ్చారు. అసలు విచారణ అప్పుడే మొదలు కావడం.. ఓపెన్కోర్టులు నిర్వహించాల్సి ఉండడంతో డిసెంబర్ 31 వరకు గడువును మూడోసారి పొడిగిస్తూ నవంబర్12న ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత నాలుగోసారి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగిస్తూ పోయినేడు డిసెంబర్21న, ఐదోసారి ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ ఫిబ్రవరి 20న, ఆరోసారి గడువును మే 31 వరకు పొడిగిస్తూ ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేశారు. మే 31 తర్వాత ఏడోసారి గడువును పొడిగించిన సర్కారు.. జులై 31 వరకు కమిషన్‌కు టైమ్ఇచ్చింది.
ముందు నుంచీ జాగ్రత్తగానే..
కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ ప్రారంభించినప్పటి నుంచి జాగ్రత్తగా వ్యవహరించారు. ఎక్కడా చిన్న లోపం లేకుండా ముందుకు సాగారు. వాస్తవానికి విద్యుత్ జ్యుడీషియల్ కమిషన్ విషయంలో జరిగిన వ్యవహారాలను పరిగణనలోకి తీసుకుని.. ఎక్కడా న్యాయపరమైన ఆటంకాలు లేకుండా విచారణను కొనసాగించారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చారు. సాంకేతిక అంశాలపై ఓ కమిటీనీ ఏర్పాటు చేశారు. అధికారులతో సమావేశాలు నిర్వహించి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్ని విభాగాల అధికారుల నుంచి అఫిడవిట్లను తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి అఫిడవిట్ల స్వీకరణను ప్రారంభించారు. అధికారులతో పాటు ఆ ప్రాజెక్టుకు సంబంధించి సమాచారం తెలిసిన ప్రైవేటు వ్యక్తుల నుంచి అఫిడవిట్లను తీసుకున్నారు. మొత్తం 58 అఫిడవిట్లు దాఖలయ్యాయి. ఆ అఫిడవిట్ల ఆధారంగానే అధికారులను విచారించారు. తొలిసారి ఆగస్టు 21న ఓపెన్కోర్టును నిర్వహించారు. ఒక్కొక్క అధికారి నుంచి స్టేట్‌మెంట్లను స్వీకరించారు. మొత్తంగా ప్రాజెక్టులో భాగమైన ఐఏఎస్అధికారులు, రిటైర్డ్ఈఎన్సీలు, సీఈలు, ఎస్ఈలు, అకౌంట్స్అధికారులు, ప్రజాప్రతినిధులు సహా 115 మందిని విచారించి.. వారి స్టేట్‌మెంట్లపై సంతకాలనూ తీసుకున్నారు.
అధికారులదో మాట.. నాటి పాలకులది ఇంకో మాట..
కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో భాగంగా అధికారులు, కాంట్రాక్ట్సంస్థల ప్రతినిధులు.. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ప్రభుత్వం చెప్పినట్టే తాము చేశామని అధికారులు విచారణలో తేల్చి చెప్పారు. అన్ని నిర్ణయాలూ ప్రభుత్వానివేనని, ఆ నిర్ణయాలను తాము అమలు చేశామని కుండబద్దలు కొట్టారు. బ్యారేజీల డిజైన్ల నుంచి బ్యారేజీల లొకేషన్ల మార్పు, ఆర్థిక అంశాలు, ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులన్నీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే జరిగాయని కమిషన్‌కు వివరించారు. ఇటు కాంట్రాక్ట్సంస్థల ప్రతినిధులు కూడా.. బ్యారేజీల్లో తొలిసారి లోపాలు బయటపడ్డప్పుడు ప్రభుత్వం స్పందించలేదని, అప్పుడే స్పందించి ఉంటే అంత నష్టం జరిగి ఉండేది కాదని కమిషన్‌కు స్పష్టం చేశారు. అయితే, అందుకు విరుద్ధంగా అప్పటి పాలకులు చెప్పడం గమనార్హం. డిజైన్లు, బ్యారేజీల లొకేషన్లను మార్చేందుకు తామేమీ ఇంజనీర్లం కాదంటూ కేసీఆర్, హరీశ్‌రావు చెప్పారు. అన్ని పనులకు కేబినెట్ ఆమోదం ఉందంటూ బదులిచ్చారు. ఇటు ఈటల రాజేందర్‌కూడా అదే సమాధానం ఇచ్చారు.
కేసీఆర్‌కూ నోటీసులు..
వాస్తవానికి అధికారులతోనే కమిషన్‌విచారణను పూర్తి చేస్తుందని అంతా భావించారు. మే 31 నాటికి అధికారుల విచారణ పూర్తయినా.. రిపోర్టును తయారు చేయాల్సి ఉండడంతో గడువును జులై 31 వరకు పొడిగిస్తూ ఏప్రిల్29న సర్కారు ఉత్తర్వులిచ్చింది. రిపోర్టు కోసమే గడువును పొడిగించారని అంతా భావించినా.. మాజీ సీఎం కేసీఆర్‌కు మే 20న కమిషన్నోటీసులిచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్5న విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. 6న ఈటల రాజేందర్, 9న హరీశ్‌రావులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే, కేసీఆర్ జూన్11న వస్తానని చెప్పడంతో ఆ తేదీనే ఖాయం చేసింది. ప్రజాప్రతినిధుల విచారణ పూర్తయిన తర్వాత కమిషన్పూర్తిగా నివేదికపైనే దృష్టిసారించింది. లీగల్ఒపీనియన్స్తీసుకుంటూ రిపోర్టును కమిషన్తయారు చేసింది.