దెబ్బతింటున్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్‌‌

దెబ్బతింటున్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్‌‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ నీటి సరఫరా కోసం రూ.800 కోట్లతో కట్టిన గ్రావిటీ కెనాల్‌‌ 20 చోట్ల కూలింది. కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌ నుంచి అన్నారం బ్యారేజీలోకి నీటిని తీసుకెళ్లడానికి 13.6 కి.మీ. దూరం ఈ కాలువ నిర్మించారు. వాటర్‌‌ లిఫ్టింగ్‌‌ స్టార్ట్‌‌ చేసి మూడేళ్లు గడిచేసరికి పలుచోట్ల సిమెంట్‌‌ కాంక్రీట్‌‌ కూలిపోయింది. మూడు నెలల క్రితం కురిసిన  భారీ వర్షాలకు కాలువ దెబ్బతినగా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వందల ఏళ్లపాటు సేవలందించాల్సిన గ్రావిటీ కెనాల్‌‌ మూడేళ్లకే దెబ్బతినడంపై ఇంజినీరింగ్‌‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీలో నిల్వ ఉన్న గోదావరి నీటిని కన్నెపల్లి పంప్‌‌హౌజ్‌‌ మోటార్ల ద్వారా లిఫ్ట్‌‌ చేసి అన్నారం బ్యారేజీలోకి పంపించడానికి 13.6 కి.మీ. దూరం గ్రావిటీ కెనాల్‌‌ నిర్మించారు. రోజుకు 3 టీఎంసీల నీటిని సరఫరా చేసేలా కట్టారు. భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌‌పూర్‌‌ అటవీ భూములను సేకరించి పనులు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ లింక్–1లో భాగంగా మేఘా కంపెనీ పనులు చేపట్టింది. రూ. 800 కోట్లతో 13.6 కి.మీ. దూరం కెనాల్‌, దానికి ఇరువైపులా బీటీ రోడ్డు నిర్మించారు.  2017 డిసెంబర్​లో పనులు మొదలుపెట్టి 2019 జూన్ 21 నాటికి పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ నీటి పంపింగ్‌‌ స్టార్ట్‌‌ చేసిన ఏడాదిన్నరకే  గ్రావిటీ కెనాల్‌ కొంత కూలిపోయింది. 20 జూన్‌‌ 2020న  6 వ కిలోమీటర్ వద్ద పైనుంచి మట్టి కూలి రోడ్డు, సిమెంట్‌‌ కాంక్రీట్‌‌ కొట్టుకుపోయాయి. అలాగే 6.7 కి.మీ. వద్ద  8.5 మీటర్ల పొడవు 7 మీటర్ల వెడల్పుతో పూర్తిగా సిమెంట్‌‌ కాంక్రీట్‌‌ కొట్టుకుపోయింది. అటవీ భూములలో లూజ్‌‌ సాయిల్‌‌ ఉన్నచోట నాసిరకం పనులు చేపట్టడం వల్లే కెనాల్‌‌ దెబ్బతిన్నదని స్థానికులు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఆ తర్వాత కాంట్రాక్ట్‌‌ సంస్థ రిపేర్లు చేసింది.  

పలుచోట్ల దెబ్బతిన్న కెనాల్‌‌

మూడు నెలల కింద కురిసిన భారీ వర్షాలకు గ్రావిటీ కెనాల్‌‌ చాలాచోట్ల దెబ్బతింది. అన్నారం గ్రామానికి దగ్గర 12వ కి.మీ. వద్ద సుమారు వంద మీటర్ల కెనాల్‌‌ భూమిలోకి కుంగిపోయింది. భూమి రెండుగా చీలడంతో బీటీ రోడ్డు మధ్యలో పగిలిపోయింది. కెనాల్‌‌ కింది భాగంలో కూడా సిమెంట్‌ ‌కాంక్రీట్‌‌ పగిలి పైకి తేలింది. ఐదు గ్రామాలకు రోడ్డు రవాణా వ్యవస్థ ఆగిపోయింది. గ్రావిటీ కెనాల్‌‌ వెంబడి పరిశీలించుకుంటూ పోతే ప్రతి కి.మీ.కు ఐదారు చోట్ల భూమి కుంగి సిమెంట్‌‌ కూలిపోవడం.. మట్టి కొట్టుకుపోయి దెబ్బతినడం వంటివి కన్పిస్తున్నాయి. మొత్తం 13.6 కి.మీ. గ్రావిటీ కెనాల్‌‌ను పరిశీలిస్తే 20 చోట్ల కెనాల్‌‌ ఖరాబైనట్లు  స్పష్టమవుతోంది. సుమారు రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. గ్రావిటీ కెనాల్‌‌ పలుచోట్ల దెబ్బతిన్నప్పటికీ రాష్ట్ర సర్కారు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్ట్‌‌ సంస్థ రిపేర్‌‌ పనులు చేపట్టడం లేదు. వందల కోట్ల విలువ చేసే కెనాల్‌‌ దెబ్బతిన్నప్పటికీ కనీస మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మూడేళ్లకే ఎందుకు కూలింది?

కన్నెపల్లి నుంచి అన్నారం వరకు 13.6 కి.మీ. దూరం గ్రావిటీ కెనాల్‌‌ పనులన్నీ మొత్తం అడవిలోనే జరిగాయి. సుమారు 70 మీటర్ల వెడల్పు, 30 అడుగుల లోతు మట్టి తవ్వుకుంటూ పోయి లెవల్‌‌ చేస్తూ సిమెంట్‌‌ కాంక్రీట్‌‌ కాలువ నిర్మించాలి. నేల స్వభావాన్ని బట్టి అంటే గట్టి మట్టి, లూజ్‌‌ సాయిల్‌‌, రాళ్లతో కూడిన నేల ఇలా రకరకాల స్థాయిలలో పనులు జరపాల్సి ఉంది. కానీ కాంట్రాక్ట్‌‌ సంస్థ నాణ్యత పాటించకపోవడంతో వర్షాలకు సిమెంట్‌‌ కాంక్రీట్‌‌ కొట్టుకుపోయి దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు. లూజ్‌‌ సాయిల్‌‌ వచ్చిన చాలాచోట్ల కెనాల్‌‌ కొట్టుకుపోయింది. ఇంకా పలుచోట్ల పగుళ్లు కన్పిస్తున్నాయి.