టెర్రరిస్టుల లింకులపై కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌‌‌ ఆరా!..ఎన్‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌ యాప్స్‌‌‌‌తో కమ్యూనికేషన్, హ్యాండర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు

టెర్రరిస్టుల లింకులపై కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌‌‌ ఆరా!..ఎన్‌‌‌‌క్రిప్టెడ్‌‌‌‌ యాప్స్‌‌‌‌తో కమ్యూనికేషన్, హ్యాండర్‌‌‌‌‌‌‌‌ ఆదేశాలు
  • ఢిల్లీలోని అజాద్‌‌‌‌పుర్ మండి, అహ్మదాబాద్‌‌‌‌ నరోడా ఫ్రూట్ మార్కెట్‌‌‌‌
  • లక్నోలోని ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆఫీసులో రెక్కీ వేసిన సయ్యద్‌‌‌‌ బృందం
  • హైదరాబాద్‌‌‌‌లోనూ రెక్కీ వేశారా? అనే కోణంలో సీఐ సెల్‌‌‌‌ దర్యాప్తు
  • సయ్యద్ సోషల్‌‌‌‌ మీడియా అకౌంట్స్‌‌‌‌, సీడీఆర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా వివరాల సేకరణ
  • గుజరాత్ ఏటీఎస్‌‌‌‌ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్న సీఐ సెల్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో ఓ కారులో చోటుచేసుకున్న పేలుడు, దేశంలో విష ప్రయోగాలకు ప్లాన్‌‌‌‌ చేసిన టెర్రరిస్టుల అరెస్టుల నేపథ్యంలో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌‌‌(సీఐ) సెల్‌‌‌‌ అలర్ట్‌‌‌‌ అయ్యింది. గుజరాత్‌‌‌‌ ఏటీఎస్‌‌‌‌కు చిక్కిన ముగ్గురు టెర్రరిస్టుల్లో..  రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ప్రధాన నిందితుడు కావడంతో సీఐ సెల్‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ బ్రాంచ్ పోలీసులు అతని నెట్‌‌‌‌వర్క్‌‌‌‌పై ఆరా తీస్తున్నారు. రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ ఫోర్త్‌‌‌‌ వ్యూ కాలనీలోని స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.  

ఢిల్లీలోని ఆజాద్‌‌‌‌పుర్ మండీ, అహ్మదాబాద్‌‌‌‌లోని నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నోలోని ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ ఆఫీసు సహా హైదరాబాద్‌‌‌‌లోనూ సయ్యద్‌‌‌‌ బృందం రెక్కీ నిర్వహించిందా? అనే కోణంలో సీఐ సెల్‌‌‌‌ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సయ్యద్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియా అకౌంట్లతో పాటు కాల్‌‌‌‌ డిటెయిల్స్ రికార్డ్‌‌‌‌( సీడీఆర్‌‌‌‌‌‌‌‌)ను సేకరిస్తున్నట్టు సమాచారం. రైసిన్‌‌‌‌ అనే ప్రాణాంతక విషం తయారు చేసి భారీ ఉగ్రవాద దాడుల కుట్ర పన్నిన కేసులో రాజేంద్రనగర్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, యూపీకి చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహైల్ సలీమ్‌‌‌‌లను గుజరాత్‌‌‌‌ ఏటీఎస్‌‌‌‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్‌‌‌‌లోనూ రెక్కీ చేశారా?

ఢిల్లీలోని ఆజాద్‌‌‌‌పుర్ మండీ, అహ్మదాబాద్‌‌‌‌లోని నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నోలోని ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ ఆఫీసు వంటి ప్రాంతాలను సయ్యద్‌‌‌‌ బృందం లక్ష్యంగా ఎంచుకున్నట్టు ఇప్పటికే ఏటీఎస్‌‌‌‌ దర్యాప్తులో వెల్లడైంది. వీటితో పాటు హైదరాబాద్‌‌‌‌లోనూ.. రెక్కీ నిర్వహించారా? అనే కోణంలో రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. గుజరాత్‌‌‌‌ ఏటీఎస్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ చేసిన ముగ్గురు నిందితులు "ఎన్‌‌‌‌క్రిప్టెడ్" యాప్స్‌‌‌‌ వినియోగించినట్టు గుజరాత్ ఏటీసీ దర్యాప్తులో తేలింది. 

సీక్రెట్ కోడ్‌‌‌‌ ద్వారా  చర్చించుకున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్  ఐఎస్ కేపీ (ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్) మాడ్యుల్‌‌‌‌కు చెందిన అబూ ఖదీజాతో యాప్స్‌‌‌‌లో కాంటాక్ట్‌‌‌‌లో ఉన్నారు. పాకిస్తాన్  హ్యాండ్లర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, మొహియుద్దీన్ తన ఉగ్ర కార్యకలాపాల కోసం రద్దీ ప్రాంతాలను పరిశీలించినట్టు తెలిసింది. 

వారం రోజుల క్రితమే సయ్యద్ అరెస్ట్‌‌‌‌!

గత వారం రోజుల క్రితమే ఏటీఎస్ పోలీసులు సయ్యద్‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఆయన సోదరుడు ఉమర్‌‌‌‌‌‌‌‌కు గుజరాత్ పోలీసులు సమాచారం అందించారు. సయ్యద్‌‌‌‌ వినియోగించిన రూమ్‌‌‌‌లోకి ఎవరూ వెళ్లొద్దని కూడా ఏటీస్‌‌‌‌ అధికారులు సూచించినట్టు ఉమర్‌‌‌‌‌‌‌‌ ద్వారా సీఐసెల్‌‌‌‌ పోలీసులు తెలుసుకున్నారు. కాగ తన సోదరుడు సయ్యద్‌‌‌‌ను బిజినెస్ పేరుతో మోసం చేసి ఉగ్ర కార్యకలాపాల్లోకి తీసుకెళ్లినట్టు ఉమర్‌‌‌‌‌‌‌‌ అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే  రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో నివాసం ఉంటున్న సయ్యద్ కుటుంబ సభ్యులను స్థానిక స్పెషల్ బ్రాంచ్‌‌‌‌ పోలీసులు విచారించారు. సయ్యద్‌‌‌‌కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. సయ్యద్‌‌‌‌ను కస్టడీకి తీసుకున్న అనంతరం గుజరాత్ పోలీసులు కూడా హైదరాబాద్‌‌‌‌లోని సయ్యద్‌‌‌‌ ఇంట్లో తనిఖీలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. 

గుజరాత్‌‌‌‌, యూపీ లింకులపై సీఐ సెల్ ఫోకస్‌‌‌‌

సయ్యద్ హైదరాబాద్‌‌‌‌కు చెందిన వాడు కావడంతో అతని ఉగ్ర లింకులపై రాష్ట్ర సీఐ సెల్‌‌‌‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు గుజరాత్‌‌‌‌, ఉత్తర్‌‌‌‌‌‌‌‌ప్రదేశ్‌‌‌‌లోని ఉగ్రవాద లింకులకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ ఫోర్త్‌‌‌‌ వ్యూ కాలనీలోని తన ఇంట్లో ఆముదం గింజలతో రైసిన్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌కు సంబంధించి రీసెర్చ్‌‌‌‌ చేశాడా? లేక గుజరాత్‌‌‌‌ గాంధీనగర్‌‌‌‌‌‌‌‌లోనే  రైసిన్‌‌‌‌ ప్రాసెసింగ్ యూనిట్‌‌‌‌ ప్రారంభించాడా? అనే కోణంలో రహస్య దర్యాప్తు జరుపుతున్నారు.  

ప్రధానంగా సయ్యద్ వినియోగించిన టెలిగ్రామ్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ సహా సోషల్‌‌‌‌ మీడియా కాంటాక్ట్స్‌‌‌‌, కాల్ డిటైల్ రికార్డ్(సీడీఆర్‌‌‌‌‌‌‌‌)పై సీఐసెల్‌‌‌‌ ఫోకస్ పెట్టింది. సయ్యద్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో ఎవరెవరు ఉన్నారనే కోణంలో స్థానిక స్లీపర్ సెల్స్‌‌‌‌, పాకిస్తాన్ హ్యాండ్లర్ల నెట్‌‌‌‌వర్క్‌‌‌‌పై దృష్టి సారించింది. ఈ మేరకు గుజరాత్ ఏటీఎస్ పోలీసులను ఇప్పటికే సంప్రదించినట్టు తెలిసింది.