
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 1, 2 అంచనా వ్యయం భారీగా పెరిగింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి, అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను ఎత్తిపోసే పనుల ఖర్చు రెండో ఎస్టిమేట్‌తో పోలిస్తే మరో రూ. 5,175 కోట్లు ఎక్కువైంది. ఆయా ప్యాకేజీలవారీగా పెరిగిన ఎస్టిమేషన్లకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్సీ) ఓకే చెప్పింది. వీటికి సర్కారు ఆమోదముద్ర వేయడం లాంఛనమే. మొదటి ఎస్టిమేట్‌తో పోల్చితే తాజా(రివైజ్డ్) ఎస్టిమేట్లో నిర్మాణ వ్యయం రూ. 8,304 కోట్లు పెరిగింది. ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పనులు ఇంకా పూర్తికాకపోవడం, మధ్యలో కొన్ని పనులు పెండింగ్ ఉండటంతో ఇంకా పెంపు తప్పదని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం లింక్ 1, 2 అంచనా వ్యయం ఫస్ట్ ఎస్టిమేట్లో రూ. 15,048 కోట్లు ఉండగా.. అటు తర్వాత దాన్ని రూ. 18,177 కోట్లకు చేర్చారు. ఇప్పుడు అదనంగా రూ. 5,175 కోట్లు యాడ్ చేసి రూ. 23,352 కోట్లకు చేర్చారు.
ఆ రెండింటికి మినహా..
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్- 1లో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం బ్యారేజీ, గుంజపడుగ పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ, గోలివాడ పంపుహౌస్‌లు, 14.2 కి.మీ.ల గ్రావిటీ కాలువ, ఆయా పంపుహౌస్‌లకు అప్రోచ్ చానళ్లు, డెలివరీ సిస్టర్న్‌లు, ఇతర పనులు చేపట్టారు.
వీటిలో ఒక్క అన్నారం బ్యారేజీ, గుంజపడుగ పంపుహౌస్ మినహా మిగతా పనుల వ్యయం భారీగా పెరిగింది. ఎల్లంపల్లి నుంచి అప్రోచ్ చానల్, ట్విన్ టన్నెల్స్ ద్వారా నందిమేడారం సర్జ్‌పూల్‌కు నీటిని తరలించే పనులు, అక్కడి పంపుహౌస్‌ను ప్యాకేజీ- 6గా పేర్కొంటారు. నందిమేడారం రిజర్వాయర్ నుంచి లక్ష్మీపూర్ పంపుహౌస్‌కు నీటిని తరలించే ట్విన్ టన్నెళ్లను ప్యాకేజీ- 7గా, లక్ష్మీపూర్ సర్జ్‌పూల్, పంపుహౌస్, ఎస్సారెస్పీ వరద కాలువ వరకు నీటిని తరలించే గ్రావిటీ కాలువ పనులను ప్యాకేజీ- 8గా పేర్కొంటారు. ఈ పనులన్నింటినీ కలిపి లింక్ -2గా వ్యవహరిస్తారు. తాజాగా వీటి ఖర్చు కూడా భారీగానే పెంచేశారు.
మెటీరియల్ కాస్ట్ పెరిగిందని..!
బ్యారేజీలు, పంపుహౌస్‌లు, సర్జ్‌పూల్స్, గ్రావిటీ కాలువలు, టన్నెళ్ల నిర్మాణం కోసం చేసే మెటీరియల్ కాస్ట్ భారీగా పెరగడంతో ఆయా పనుల వ్యయం పెరిగినట్టుగా రివైజ్డ్ ఎస్టిమేషన్లలో పేర్కొన్నారు. వీటితోపాటు ప్రాజెక్టు వర్క్ సైట్లలో హెలీప్యాడ్లు, క్యాంపు ఆఫీసులు, వాటిల్లో అధునాతన హంగుల కోసం భారీగా వెచ్చించారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గెస్ట్‌హౌస్, స్టాఫ్ క్వార్టర్స్, గార్డ్ రూం, పైలాన్, టెంట్లు, వెల్‌కం ఆర్చి, బ్రోచర్ల పేరుతో రూ. 10.44 కోట్లు ఖర్చు చేశారు. నాన్ కాంట్రాక్ట్ వర్క్‌లుగా వీటిని రివైజ్డ్ ఎస్టిమేషన్లలో పేర్కొన్నారు. ఈ బ్యారేజీ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఫ్లడ్ బ్యాంక్స్, గైడ్‌బండ్స్ పనులను రివైజ్డ్ ఎస్టిమేట్లలో చేర్చినా అవి పూర్తి చేసే సరికి వాటి నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశముంది. ప్యాకేజీ-6లోనూ ఇలాంటి పనులకే రూ.17.85 కోట్ల లెక్క తేల్చారు. మిగతా అన్ని వర్క్‌సైట్లలో రూ.10 కోట్లకు పైగానే ఇలాంటి పనులకు ఖర్చు చేశారు. అంచనాల పెంపునకు సీఎం గతంలోనే ఓకే చెప్పడంతో ఆమోదం లాంఛనమేనని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
పునరుజ్జీవానికి డబుల్
కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో ఎస్సారెస్పీకి జీవం పోస్తామని మొదలుపెట్టిన ఎస్సారెస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం డబుల్ అయింది. వరద కాలువపై మూడు దశల్లో నీటిని ఎత్తిపోసే ఈ పనులకు రూ. 1,067 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇవ్వగా, మధ్యలో రూ. 684 కోట్లు యాడ్ చేసి దాన్ని రూ.1,751 కోట్లగా మార్చారు. దీనికి రెండు నెలల క్రితం రూ. 248.10 కోట్లు యాడ్ చేసి రూ. 1999.10 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చారు. ఈ స్కీం వ్యయం పెంపుపై ఇరిగేషన్ ఇంజనీర్లే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పంపుహౌస్ ఫ్లోరింగ్, సప్లిమెంట్ పనులు, ఆఫీస్ రూముల్లో సీలింగ్, ఇతర పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, శానిటరీ వర్క్స్, నాన్ కాంట్రాక్ట్ వర్క్స్‌కు రూ. 248.10 కోట్లు అంచనా పెరిగినట్టుగా నివేదించారు.