
- మరో 25 మందికి గాయాలు
- ఉత్తరాఖండ్, యూపీ, ఒడిశాలో రోడ్డు ప్రమాదాలు
ముజఫర్‌నగర్/హరిద్వార్: కన్వర్ యాత్రలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు భక్తులు చనిపోగా, మరో 25 మంది గాయపడ్డారు. బాధితుల్లో కొంతమంది పవిత్ర గంగాజలం కోసం ఉత్తరాఖండ్‌కు వెళ్తుండగా, మరికొంత మంది గంగాజలం తీసుకుని తిరుగుపయనమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఢిల్లీ, హరిద్వార్ నేషనల్ హైవేపై శనివారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొని ఒకరు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు.
యూపీలోని సలెంపూర్‌లో రెండు బైకులు ఢీకొని ఒకరు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. ఘజియాబాద్‌లో బైక్, స్కూటీని అంబులెన్స్ ఢీకొట్టడంతో ముగ్గురు కన్వర్ యాత్రికులు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. బాధితులు రెండు బండ్లపై హరిద్వార్‌కు వెళ్తుండగా, ఎదురుగా ఓవర్ స్పీడ్‌తో వచ్చిన అంబులెన్స్ ఢీకొట్టింది. అంబులెన్స్ సీజ్ చేసి, డ్రైవర్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇక ఒడిశాలో ఓ టెంపుల్‌కు కన్వర్ యాత్రికులు ఆటోలో వెళ్తుండగా వ్యాన్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహిళా భక్తురాలు చనిపోగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి పవిత్ర గంగాజలం తీసుకుని తిరిగి బయలుదేరిన భక్తుల ట్రక్కు.. అదే రాష్ట్రంలోని న్యూ టిహరి సిటీలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది యాత్రికులు గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
సీఆర్పీఎఫ్ జవానుపై దాడి..
సీఆర్పీఎఫ్ జవానుపై కన్వర్ యాత్రికులు దాడి చేశారు. ఈ ఘటన యూపీలోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. యాత్రికులు జార్ఖండ్‌లోని బైద్యనాథ్ ధామ్‌కు వెళ్తుండగా, జవాన్ డ్యూటీ కోసం మణిపూర్ వెళ్తున్నాడు. వీళ్లు బ్రహ్మపుత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కేందుకు టికెట్లు కొనుక్కుంటుండగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో జవానుపై యాత్రికులు దాడి చేశారు. వాళ్లను అరెస్టు చేసి, తర్వాత బెయిల్ ఇచ్చామని రైల్వే పోలీసులు తెలిపారు.
కన్వర్ యాత్రికులకు యోగి స్వాగతం..
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి పవిత్ర గంగాజలం తీసుకుని తిరుగుపయనమైన వేలాది మంది కన్వర్ యాత్రికులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీరట్‌లో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాళ్లపై పూలు చల్లారు.