అమెరికాలో భారత సంతతి డాక్టర్ నిర్వాకం..లైంగిక కోరికలు తీరిస్తేనే ప్రిస్ర్కిప్షన్ ఇస్త

అమెరికాలో భారత సంతతి డాక్టర్ నిర్వాకం..లైంగిక కోరికలు తీరిస్తేనే ప్రిస్ర్కిప్షన్ ఇస్త
  • అతడి మెడికల్ లైసెన్స్ రద్దు చేసిన కోర్టు

న్యూయార్క్: అక్రమంగా డ్రగ్స్‌‌ సరఫరా, ప్రిస్క్రిప్షన్లను ఎరగా వేసి పేషెంట్లను లొంగదీసుకుంటున్న భారత సంతతి డాక్టర్ ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూజెర్సీలోని సెకాకస్‌‌ కు చెందిన 51 ఏండ్ల డాక్టర్‌‌ రితేష్ కల్రా తప్పుడు ప్రిస్క్రిప్షన్లు ఇవ్వాలంటే తన లైంగిక కోర్కెలు తీర్చాలని ఒత్తిడి చేసినట్టు పలువురు పేషెంట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి యూఎస్‌‌ కోర్టులో హాజరుపర్చారు. ఈ మేరకు న్యూజెర్సీ అటార్నీ కార్యాలయం  ఒక ప్రకటన విడుదల చేసింది. 

డాక్టర్‌‌ రితేష్ కల్రా న్యూజెర్సీలోని సెకాకస్‌‌ ప్రాంతంలో ఫెయిర్ లాన్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అతడు అవసరం లేకుండానే తన క్లినిక్‌‌లో ఆక్సికోడోన్ తో సహా ఓపియాయిడ్, కోడైన్ తో కూడిన ప్రోమెథాజిన్ వంటి శక్తిమంతమైన డ్రగ్స్‌‌ను పేషెంట్లకు ఇస్తుండేవాడు. ఆ మందులను వారికి వ్యసనంగా మార్చేవాడు. అతడు 2019 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 31,000 కంటే ఎక్కువ ఆక్సికోడోన్ ప్రిస్క్రిప్షన్‌‌ లను పేషెంట్లకు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. వాటికి అలవాటుపడిన వారు మరిన్ని మందులు కావాలని అడిగేవారు. దీంతో ప్రిస్క్రిప్షన్‌‌ కావాలంటే తన లైంగిక కోరికలు తీర్చాలని మహిళా పేషెంట్లను బలవంతం చేసేవాడని అధికారులు చెప్పారు. 

తమతో అసభ్యంగా ప్రవర్తించాడని.. లైంగిక దాడికి పాల్పడ్డాడని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చర్యల ద్వారా అతడు న్యూజెర్సీ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేశాడని, అధిక మెతాదు కలిగిన డ్రగ్స్ ఇచ్చి రోగుల ప్రాణాలుకు ముప్పు కలిగించడాని అధికారులు పేర్కొన్నారు. దీంతో రితేష్ కల్రా మెడికల్ లైసెన్స్‌‌ ను సస్పెండ్ చేసినట్టు యూఎస్‌‌ కోర్టు వెల్లడించింది. అతడు తన క్లినిక్‌‌ ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. రితేశ్ కల్రా తరఫు న్యాయవాది మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వ ప్రకటన సూపర్ మార్కెట్ టాబ్లాయిడ్ మాదిరిగా ఉందని ఆరోపించారు.