కాళేశ్వరంతో కాంట్రాక్టర్లకే ఉపయోగం.. రైతులకు కాదు

కాళేశ్వరంతో కాంట్రాక్టర్లకే ఉపయోగం.. రైతులకు కాదు

15వ ఆర్థిక సంఘం తెలంగాణపై తీవ్ర ఆరోపణలు చేసిందన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. కాళేశ్వరం వయబుల్ కాదంటూ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు DPR ఇంతవరకు ఇవ్వకపోవడం విడ్డురంగా ఉందన్నారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదుని ఆరోపించారు. ఆ ప్రాజెక్టుతో కాంట్రాక్టర్లకే ఉపయోగం తప్ప రైతులకు కాదు అంటూ 15వ ఆర్థిక సంఘం చెప్పిందన్నారు.

కరెంట్ బిల్లుకే 10 వేల కోట్లు అయ్యే ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు షబ్బీర్ అలీ. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుందన్నారు.సీడబ్ల్యూసీ నిబంధనలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లేదన్నారు. సొంత కమీషన్ల కోసమే కాళేశ్వరం సీఎం కేసీఆర్ నిర్మించారన్నారు. అప్పులు తెస్తా,జేబులు నింపుకుంటా అనే విధానాన్ని కేసీఆర్ అవలంబిస్తున్నారన్నారు. కేసీఆర్ మంత్రులు ఢిల్లీ వెళ్లరు… కేంద్రం నుంచి నిధులు తీసుకురారు అని అన్నారు. లోన్ కి రెవెన్యూ చూపించి అప్పులు తెస్తున్నారన్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు షబ్బీర్.

కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తి తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులను జైల్లో వేయాలన్నారు షబ్బీర్ అలీ. కేంద్రం స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. లోటు బడ్జెట్ లో ఉండి ధనిక రాష్ట్రమంటూ తప్పుడు సమాచారం ఇస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పుదోవపట్టిస్తున్నారని తెలిపారు.

యూనివర్శిటీల్లో వీసీలను నియమించకుండా సీఎం.. దివాళా వర్శిటీలుగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీసీలను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే బడ్జెట్ లో విద్య, నిరుద్యోగం,ఆరోగ్యం వంటి శాఖలకు అధిక నిధులు కేటాయించాలన్నారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ కు గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలన్నారు.

తెలంగాణ… కేసీఆర్ ఒక్కరితోనే సాధ్యమైందా? అందరూ కలిస్తేనే తెలంగాణ సాధ్యమైందని తెలిపారు షబ్బీర్ అలీ. కేటీఆర్ ను సీఎంగా చేయాలనే కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారన్నారు. బీసీ అయిన ఈటలను బెదిరించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందని…ఎవరికి అధికారం ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ వ్యక్తి అని… ఆయనను సీఎం చేసింది కాంగ్రెసేనని తెలిపారు.

పూర్తిస్థాయి విధివిధానాలు వచ్చాకే షర్మిల ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు షబ్బీర్ అలీ. కొత్త పార్టీలు వస్తుంటాయి… పోతుంటాయి.. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు.