- వాటివల్లే నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ: మాజీ మంత్రి హరీశ్
- కాళేశ్వరాన్ని కూలేశ్వరమన్న సీఎం.. ఆ ఫ్యాక్టరీకి ఎలా శంకుస్థాపన చేస్తడు?
- బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రేవంత్ రిబ్బన్ కటింగ్చేస్తున్నాడని ఎద్దేవా
- సిద్దిపేటకు వచ్చిన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు తన్నుకుపోయిండని ఫైర్
- సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ
సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం నీళ్లతోనే పామాయిల్ తోటలు, వాటి వల్లే నర్మెట్టలో రూ.300 కోట్లతో ఆయిల్ పామ్ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ అన్నారు. అలాంటి కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. పామాయిల్ ఫ్యాక్టరీకి ఎలా శంకుస్థాపన చేస్తాడని ఆయనప్రశ్నించారు. బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రేవంత్రిబ్బన్ కటింగ్చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. తమది శ్రమ ఫలితమైతే.. రేవంత్దేమో శిలాఫలకమన్నారు.
ఈ మేరకు శనివారం సిద్దిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్‌రావు, సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘కాళేశ్వరం, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా, మొక్కవోని దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేసి కోనసీమలో మాత్రమే కనిపించే పామాయిల్ మొక్కలను సిద్దిపేట జిల్లాలో నాటించాం. ఆ కాళేశ్వరం జలాల ఆధారంగానే పామాయిల్ పంటలు పండుతున్నాయి. ఆ క్రమంలోనే నర్మెట్టలో రూ.300 కోట్లతో పూర్తిచేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభిస్తున్నారు.
బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రేవంత్ రిబ్బన్ కటింగ్చేస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన ప్రాజెక్టు ఒక్కటి లేదని హరీశ్ అన్నారు. సిద్దిపేటలో సీఎం రేవంత్ ప్రారంభించనున్న కార్యక్రమాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి, నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేసినవేనన్నారు. పనులు మొదలైన సిద్దిపేట వెటర్నరీ కాలేజీని తన కొడంగల్ నియోజకవర్గానికి రేవంత్ తన్నుకుపోయారన్నారు. ‘‘శిలాఫలకాలపై నీ పేరు ఉండొచ్చేమో రేవంత్.. కానీ, సిద్దిపేట ప్రజల మనోఫలకాలపై ఉండేది మాత్రం కేసీఆర్ పేరే. రూ. 300 కోట్లతో నర్మెట్టలో ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతే. దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రావడానికి, రిఫైనరీ పెట్టడానికి మేమే నిర్ణయం తీసుకున్నాం.
టీజీఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చాం. రైతులను స్వయంగా ఒప్పించి మొక్కలు నాటించాం. నాడు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి.. ఇయ్యాల అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఫ్యాక్టరీని ప్రారంభించడం శోచనీయం. ఈ ఫ్యాక్టరీ కోసం కాలువ పొడిగించి 20 కోట్ల లీటర్ల సామర్థ్యం గల చెరువును నిర్మించి నీరందించింది మేమే. పక్కనే పారుతున్న కాళేశ్వరం కాలువ నీళ్లను నెత్తిన జల్లుకుని ఫ్యాక్టరీని ప్రారంభించు’’ అని ఆయన అన్నారు.
సిబ్బంది లేకున్నా శిలాఫలకాలా?
ఆరోగ్య శాఖ మంత్రిగా తాను నాడు మంజూరు చేసి, నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలకు ఇప్పుడు సీఎం రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రూ.3.60 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్, రూ.25 కోట్లతో ఆయుష్ ఆస్పత్రి, గట్ల మల్యాలలో రూ.1.40 కోట్లతో పీహెచ్‌సీ, సిద్దిపేట పట్టణంలో అర్బన్ పీహెచ్‌సీ భవనాలు కట్టింది తమ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభానికి నోచుకోకపోయినా ఇప్పటికే సేవలందిస్తున్నాయని తెలిపారు. వాటికి సిబ్బందిని నియమించకుండానే శిలాఫలకాలు వేసుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.
దేవాలయాలు, విద్యాలయాలతో పాటు రూ.78 కోట్లతో 30 ఎకరాల స్థలంలో జిల్లా జైలును నిర్మించింది కూడా తామేనన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా 52 శాతం మందికి, అంటే 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రూ. 300 కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. సీఎం పర్యటిస్తున్న నర్మెట్టలోనే 350 మంది రైతులకు రుణమాఫీ కాలే దన్నారు.
