
- చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అడ్డుకున్న ‘కాళేశ్వరం’ ముంపు రైతులు
- నాలుగేండ్లుగా పంటలు మునుగుతున్నా పరిహారం ఇస్తలేరని నిలదీత
- భారీ బందోబస్తు మధ్య బతుకమ్మ వాగును సందర్శించిన సుమన్
చెన్నూర్, వెలుగు: ‘కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మాకు సుక్క నీళ్లస్తలేవ్..కానీ, నాలుగేండ్ల సంది పంటలన్నీ మునుగుతున్నయ్. మీరు గిట్ల రోడ్ల పొంట తిరుగుడు కాదు సారూ.. ఒక్కసారి మా చేన్లల్లకు వచ్చి సూడున్రి..మా గోసేందో తెలుస్తది’ అంటూ మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాళేశ్వరం బ్యాక్‌వాటర్ ముంపు రైతులు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను నిలదీశారు. శనివారం మధ్యాహ్నం చెన్నూర్‌కు వచ్చిన సుమన్ క్యాంప్ఆఫీసులో కలెక్టర్బదావత్సంతోష్తో కలిసి అధికారులతో రివ్యూ మీటింగ్నిర్వహించారు.
తర్వాత పట్టణ శివారులోని బతుకమ్మ వాగు బ్రిడ్జిని పరిశీలించడానికి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బయల్దేరారు. అప్పటికే విషయం తెలుసుకొని గోదావరి ఎక్స్‌రోడ్డు వద్ద ఎదురుచూస్తున్న సుమారు 50 మంది రైతులు సుమన్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డు మీద వద్దంటూ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరకు రైతులను తీసుకెళ్లారు. ‘నాలుగేండ్ల నుంచి పంటలు మునిగి తీవ్రంగా నష్టపోతున్నాం. ఎమ్మెల్యేగా ఉన్న మీరు గానీ, సర్కారు గానీ మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలే’ అని మండిపడ్డారు.
నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇయ్యకపోవడంతో తామంతా విషం తాగి చనిపోయే పరిస్థితి వచ్చిందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న మునిగిన పంటలకు ఎకరానికి రూ.50 వేల ఖర్చు వచ్చిందని, పెట్టుబడి గంగ పాలైందని, ఏటా లక్షల్లో నష్టపోతున్నామని వాపోయారు. అప్పులబాధకు భూములను అమ్ముకుందామంటే ముంపు భూములని రేటు రావడం లేదన్నారు. అటు భూములు అమ్ముకోలేక, ఇటు అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు. తమకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలంటూ నిలదీశారు. పంటనష్టం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని చెప్తూ సుమన్ అక్కడినుంచి వెళ్లిపోయారు.
ఖమ్మంలో మున్నేరు ముంపు బాధితుల ఫైర్
ఖమ్మం : ఖమ్మం జిల్లా మున్నేరు ముంపు ప్రాంతాల్లో బాధితులు తమకు సరుకులు, కూరగాయలు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారంటూ ఫైర్ అయ్యారు. శనివారం మంత్రి అజయ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన వెళ్లిన తర్వాత మునిగిన ఇండ్లను పరిశీలించకుండానే సరుకులు పంపిణీ చేస్తున్నారని, ఐదారు రోజులుగా చీకట్లో ఉంటే కనీసం తిరిగిచూడలేదని అధికారులపై మోతీనగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కరకట్ట కట్టిస్తామని హామీ ఇచ్చారని, ఏమైందని మేయర్నీరజ, సుడా చైర్మెన్బచ్చు విజయ్‌కుమార్ లను ప్రశ్నించారు.