ప్రాచీన శిల్పాలకు కొత్త రూపు... కాళేశ్వరంలో రూ.1.20 కోట్లతో మ్యూజియం ఏర్పాటు.

ప్రాచీన శిల్పాలకు కొత్త రూపు... కాళేశ్వరంలో రూ.1.20 కోట్లతో మ్యూజియం ఏర్పాటు.

ఆకట్టుకుంటున్న 11వ శతాబ్దపు విగ్రహాలు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కాళేశ్వర క్షేత్రంలోని ప్రాచీన శిల్ప సంపదకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోసింది. వందల ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన శిల్పాలను పురావస్తు శాఖ పరిశీలించి, అవి 11, 12, 13వ శతాబ్దాలకు చెందినవిగా గుర్తించింది. ఈ చారిత్రక విగ్రహాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా రూ.1.20 కోట్లతో కాళేశ్వర ఆలయం సమీపంలో మ్యూజియం ఏర్పాటు చేశారు. 

సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ మ్యూజియాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మ్యూజియం పుష్కర భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విగ్రహాల కాలం, నిర్మాణ శైలి, ఉపయోగించిన రాళ్ల వివరాలను బోర్డుల్లో పొందుపరిచారు. పూల అలంకరణ, కలర్ లైటింగ్‌‌తో మ్యూజియం సందర్శకులను ఆకట్టుకుంటోంది. 

105 విగ్రహాలు..

కాళేశ్వర, ముక్తీశ్వర క్షేత్రం కాకతీయులు, చాళుక్యులు తదితర రాజవంశాల కాలానికి చెందిన విశిష్ట శిల్ప సంపదకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. శైవ ద్వారపాలకులు, మత్స్య–కూర్మ అవతార శిల్పాలు, అన్నపూర్ణాదేవి చతుర్ముఖ లింగం వంటి ఎన్నో శిల్పాలు చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. కాలక్రమేణా నిరాదరణకు గురైన ఈ విగ్రహాలను గుర్తించి, శుభ్రపరచి, కళా నైపుణ్యం స్పష్టంగా కనిపించేలా పునరుద్ధరించారు. 

మ్యూజియంలో మొత్తం 105 విగ్రహాలను భద్రపరిచారు. ఎర్రరాయి, బసాల్ట్, గ్రానైట్ రాళ్లతో చెక్కిన శివలింగాలు, యముడు, సూర్యుడు, చతుర్ముఖ బ్రహ్మలింగం, కృష్ణుడు, బలరాముడు, అగ్నిస్తంభం వంటి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శిల్పాలను తెలంగాణ ప్రభుత్వం మ్యూజియంలో భద్రపరచడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక కాళేశ్వర క్షేత్ర పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి రూ.198 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా, సరస్వతీ అంత్యపుష్కరాల కోసం రూ.30.60 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం మరో రూ.120 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.