
తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్, మేఘా కృష్ణా రెడ్డి కోసమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో మరో కాంట్రాక్టర్ లేనట్లు మేఘా కృష్ణారెడ్డికే అన్ని ప్రాజెక్టులూ అప్పగిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం, పాలమూరు, మిషన్ భగీరథ ప్రాజెక్టులన్నీ మేఘా కంపెనీకే ఎందుకు కట్టబెడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి దేశంలోగానీ, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదన్నారు. కేసీఆర్ మనిషి అయినందుకే అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఆయనకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ పార్ట్ నర్ అని, ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో వారిద్దరు కలిసి పట్టపగలే దోచుకుని బాగుపడ్డారని. విమర్శించారు. బలిదానాల చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు వీళ్లకు పనికి వస్తుందంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్లియ్యలె
కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో నాణ్యత లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కాంట్రాక్టర్ తప్పు లేదు. అది పెద్ద తప్పేం కాదు’ అన్నట్లు అధికారులు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రాజెక్ట్ డ్యామేజ్ అయితే క్లౌడ్ బరెస్ట్ అందుకు కారణమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ప్రొటెక్షన్ వాల్ కూడా సరిగా నిర్మించలేదని వాపోయారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ ద్వారా కనీసం ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదన్న షర్మిల... గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ఒక అద్బుతం అయితే మూడేళ్లలో ఎందుకు మునిగిపోయిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ఒక అద్బుతమైన అబద్ధం...ఒక మోసం అని చురకలంటించారు.
రీడిజైనింగ్ కోసం ఎన్ని పుస్తకాలు చదివిండు
80 వేల పుస్తకాలు చదివానని చెప్పే కేసీఆర్ చేసింది ఇదేనా అంటూ షర్మిల ప్రశ్నించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఎన్ని ఇంజనీరింగ్ పుస్తకాలు చదివి కట్టారు. రీ డిజైనింగ్ మీద ఎన్ని పుస్తకాలు చదివారు. కాళేశ్వరం నా చెమట, రక్తం అన్నారు. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు’ అంటూ నిలదీశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వైఎస్సార్ రూ.33 వేల కోట్లతో రూపొందించారని, కానీ కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ తల అయిన ప్రాణహిత.. కాళ్లు అయిన చేవెళ్లను కట్ చేశారని చెప్పారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.33 వేల కోట్ల నుంచి లక్షా 70 వేల కోట్లకు పెంచారన్న షర్మిల... కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఫోటోల కోసం ఉపయోగపడే టూరిస్ట్ స్పాట్ గా మార్చారని షర్మిల విమర్శించారు. ‘45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి..ఇప్పుడేమో 55 వేల ఎకరాలకు నీరిస్తున్నామని చెప్తున్నారని ఫైర్ అయ్యారు.
కాళేశ్వరం కాదు.. కమీషన్ల ప్రాజెక్ట్
కాళేశ్వరం ప్రజల ప్రాజెక్ట్ కాదని, పూర్తిగా కేసీఆర్ కమీషన్ల ప్రాజెక్ట్ అని షర్మిల ఆరోపించారు. దోచుకోవడానికి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ప్రాజెక్ట్ ల పేరుతో అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు. మూడేళ్లలో కూలిపోయే ప్రాజెక్ట్ ను ఎక్కడైనా చూశామా..? అంటూ షర్మిల సెటైర్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్నా ఎక్కువ వరదలు వచ్చినా దేవాదుల ప్రాజెక్ట్ చెక్కు చెదరలేదన్న విషయాన్ని షర్మిల గుర్తు చేశారు.
కాళేశ్వరంలో రూ.70వేల కోట్ల అవినీతి
దేవాదుల వైఎస్ సమర్థతకు నిదర్శనమైతే.. కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి నిదర్శనమని షర్మిల విమర్శించారు. రెండు టీఎంసీలు కూడా నీళ్ళు ఎత్తింది లేదని...మళ్ళీ మూడో టీఎంసీ ఎత్తడానికి సిద్ధం అయ్యారని విమర్శించారు. ఆ పనులను కూడా మళ్లీ మేఘా కృష్ణారెడ్డికి ఇవ్వడానికి సిద్ధం అయ్యారని, కేసీఆర్ ప్రాజెక్టులన్నీ ఒక్కరికే అప్పజెప్పి మిగతా కాంట్రాక్టర్లను బ్రతకనివ్వరా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ 70 వేల కోట్ల అవినీతి జరిగిందన్న షర్మిల..... 12 వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారని రిపోర్ట్స్ ఉన్నా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.