దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ : నడ్డా

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ : నడ్డా
  • ప్రాజెక్టును కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంలా వాడుకున్నది
  • బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస సమితి
  • భూముల ఆక్రమణకే ధరణి పోర్టల్
  • హుజూర్​నగర్ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి వ్యాఖ్య

హుజూర్ నగర్, వెలుగు: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. బీఆర్ఎస్ అంటేనే.. భ్రష్టాచార్ రాక్షస సమితి అని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియా మకాల కోసం సకుల జనులు ఏకమై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీగా మారిందన్నారు. శనివారం హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్పసభకు ఆయన చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ‘‘బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే... తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రానికి కేం ద్రం భారీగా నిధులు మంజూరు చేస్తున్నది. కానీ, కేసీఆర్ ఆ నిధులను దారిమళ్లిస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్ల కన్ను అసైన్డ్ భూములపై పడ్డది. వాటిని ఆక్రమించుకునేందుకే ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. పేదల భూములు లాక్కొని కోట్ల రూపాయలు దండుకున్నరు”అని జేపీ నడ్డా ఆరోపించారు. 

కమీషన్లపై కేసీఆరే ఒప్పుకున్నరు

దేశంలోని నీటి ప్రాజెక్టుల్లో జరిగిన అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అని జేపీ నడ్డా ఆరోపించారు. రూ.38వేల కోట్ల ప్రాజెక్ట్ ను రూ.లక్షా 20 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఫ్యామిలీ ఏటీఎంలా మార్చుకున్నదని ఆరోపించారు. ‘‘బీజేపీని ఓడించేందుకు తీసుకొచ్చిన దళితబంధు పథకంలోనూ బీఆర్ఎస్ లీడర్లు 30శాతం కమీషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని కేసీఆరే ఒప్పుకున్నారు. రైతులు పంట నష్టపోతే ప్రధానమంత్రి ఫసల్ బీమా స్కీమ్ ద్వారా పరిహారం చెల్లిస్తున్నాం. ఈ స్కీమ్ దేశమంతా ఉన్నా.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ అమలు కానివ్వడం లేదు. రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదు”అని జేపీ నడ్డా విమర్శించారు.  

యువత ప్రాణ త్యాగంతోనే తెలంగాణ

తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది యువ కులు ప్రాణ త్యాగం చేశారని జేపీ నడ్డా అన్నారు.  హుజూర్​నగర్​లో బీజేపీ, కోదాడలో జనసేన అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చారు. 

అభివృద్ధి కంటే..అవినీతే ఎక్కువుంది 

సీతాఫల్​మండి, వెలుగు: కేసీఆర్ కుటుం బం పోరాడితే తెలంగాణ రాలేదని, విద్యార్థులు ఉద్యమిస్తే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్, అభివృద్ధి కంటే.. అవినీతే ఎక్కువ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టే దీనికి ఉదాహరణ అని విమర్శించారు. సీతాఫల్​మండిలో నిర్వహించిన రోడ్​షోలో నడ్డా మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.