తాగు, సాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యం

తాగు, సాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యం
  • పాత డిజైన్​ ప్రకారమే ప్రాణహిత,చేవెళ్ల ప్యాకేజీ 22 పనులు
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాకు సాగునీటిని అందించే ప్రాణహిత–-చేవెళ్ల(కాళేశ్వరం) ప్యాకేజీ 22 పనులు ముందుకెళ్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ తెలిపారు. శనివారం కామారెడ్డి ఆర్అండ్​బీ గెస్ట్​హౌజ్​లో ప్యాకేజీ 22 పనులు, తాగునీటి పైప్​లైన్, ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో రివ్యూ చేశారు. పనులు స్పీడప్​ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్యాకేజీ 22 పనులను పాత డిజైన్​ ప్రకారం చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారన్నారు. 

పెండింగ్​లో ఉన్న 316 ఎకరాల భూ సేకరణకు సంబంధించిన అమౌంట్​ చెల్లించేందుకు రూ.23 కోట్లు రిలీజ్​ అయ్యాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్​ హయాంలో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో  ప్రాణహిత–-చేవెళ్ల ప్యాకేజీ 20, 21, 22 పనులు చేపట్టామని చెప్పారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్యాకేజీ 22 పనులను నిర్లక్ష్యం చేసిందని, డిజైన్​ మార్పుతో పనులు ముందుకెళ్తాయా? లేదా? అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఇటీవల ఈ పనులపై మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి హైదరాబాద్​లో రివ్యూ చేసి, పాత డిజైన్​ ప్రకారం పనులు చేపట్టేందుకు నిర్ణయించారన్నారు. 

కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లిలో త్వరలో రిజర్వాయర్​ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. తిమ్మక్​పల్లి, మోతే, కాటేవాటి, ధర్మారావుపేటల్లో  చేపట్టే రిజర్వాయర్లతో 5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచవచ్చని, వర్షాకాలంలో ఎస్ఆర్ఎస్పీ నుంచి సర్ ప్లస్​​వాటర్​ ఇక్కడికి తరలిస్తారని తెలిపారు. కామారెడ్డి ఏరియాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చడమే తన జీవత ఆశయమన్నారు. ఇరిగేషన్​ సీఈ శ్రీనివాస్, ఆర్​డబ్ల్యూఎస్​ ఎస్ఈ రాజేంధర్, ఆర్డీవో వీణ, లైబ్రరీ చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు పాల్గొన్నారు.