Renu Desai: "అంతా నాశనమైపోతుంది".. కుక్కల దాడి ఇష్యూలో 'కల్కి' సినిమాను లాగిన రేణు దేశాయ్!

Renu Desai: "అంతా నాశనమైపోతుంది".. కుక్కల దాడి ఇష్యూలో 'కల్కి' సినిమాను లాగిన రేణు దేశాయ్!

వీథి కుక్కల సమస్యలు.. వాటిపై జరుగుతున్న దాడులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికురాలిగా తన గళాన్ని వినిపిస్తూ నటి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.  ట్రోలర్లు ఆమె టార్గెట్‌గా చేసుకుని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రేణు దేశాయ్.. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా ఈ వివాదాన్ని ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా మరోసారి తన వాణిని బలంగా వినిపిస్తూ వీడియోను రిలీజ్ చేశారు..

వక్రీకరణపై రేణు దేశాయ్ ఆగ్రహం

ఇటీవల నేను ఒక ప్రెస్‌మీట్ పెట్టి దాదాపు 30 నిమిషాలు మాట్లాడాను. అయితే  కొందరు అందులోని చిన్న చిన్న ముక్కలను కట్ చేసి, నేను ఏదో మనుషులకు వ్యతిరేకం అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. అసలు అర్థాన్ని మార్చి వైరల్ చేస్తున్నారని రేణు మండిపడ్డారు. నన్ను ట్రోల్ చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి లాభం లేదు. నేను కేవలం జంతువుల ప్రాణాల గురించి మాత్రమే కాదు, మనుషుల భద్రత గురించి కూడా మాట్లాడాను అని ఆమె స్పష్టం చేశారు.

జైల్లో వేస్తామని బెదిరింపులు..

గతేడాది సుమారు 1000కి పైగా వీధి కుక్కలను కాపాడినట్లు  రేణు దేశాయ్ వెల్లడించారు. అలాంటి తనను కొందరు జైల్లో వేస్తామని బెదిరించడం, అసభ్యకరంగా ట్రోల్ చేయడం విచారకరమని వాపోయారు. కొన్ని కుక్కలు పిచ్చిగా ప్రవర్తించవచ్చు , ఇబ్బంది పెట్టవచ్చు. కానీ వాటి కోసం వీధిలోని అన్ని కుక్కలను అన్యాయంగా చంపేయడం ఎంతవరకు సమంజసం? అని ఆమె ప్రశ్నించారు.  మనుషులైనా, జంతువులైనా అందరూ బాగుండాలన్నదే నా కోరిక అని అన్నారు. కేవలం కుక్కలను చంపడం వల్ల సమస్య తీరదు. మగ కుక్కలకు స్టెరిలైజేషన్ చేయిస్తే ఆరు నెలల్లోనే వాటి జనాభా గణనీయంగా తగ్గుతుందని ఆమె వివరించారు.

"కల్కి" సినిమాను ప్రస్తావిస్తూ..

"మనం కలియుగం వైపు వేగంగా వెళ్తున్నాం. కుక్కలు, పిల్లులు, కోతులు.. చివరికి మనుషులం కూడా ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా చూశారు కదా.. అందులో చూపించినట్లుగానే అంతా నాశనం కాబోతోంది. అదే కలియుగం! మన జీవితం తాత్కాలికం.  కనీసం ఇప్పటికైనా రాగద్వేషాలు పక్కనపెట్టి మానవత్వంతో ఆలోచించండి అని ఆమె హితవు పలికారు.

►ALSO READ | Border 2: గల్ఫ్ దేశాల్లో ‘బార్డర్ 2’కి నో ఎంట్రీ.. ధురంధర్’ తరహాలోనే బ్యాన్.. ఎందుకిలా జరుగుతుంది?

పరిష్కారం ఏంటి?

కేవలం విమర్శించడమే కాకుండా, సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా ఆమె సూచించారు. మగ కుక్కలకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు చేయించడం ద్వారా ఆరు నెలల్లోనే వాటి జనాభాను గణనీయంగా తగ్గించవచ్చు. వీధి కుక్కలను ఊరి బయట ఉన్న షెల్టర్లకు తరలించడం ద్వారా మనుషులకు ఇబ్బంది లేకుండా చూడవచ్చు. మూగజీవాలను హింసించడం వల్ల వచ్చే 'కర్మ'ను అనుభవించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.

రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లను రెండు వర్గాలుగా విభజించాయి. కొందరు ఆమె జంతు ప్రేమను సమర్థిస్తుంటే, కుక్కల దాడులకు గురైన కుటుంబాల బాధను కూడా అర్థం చేసుకోవాలని మరికొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనా, ఒక సామాజిక సమస్యను ‘కల్కి’ వంటి భారీ సినిమాతో ముడిపెట్టి ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)