నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం.. ప్రజా కవి కాళోజీ జయంతి సందర్భంగా ప్రదానం

నెల్లుట్ల రమాదేవికి  కాళోజీ పురస్కారం.. ప్రజా కవి కాళోజీ జయంతి సందర్భంగా ప్రదానం
  • సీఎం రేవంత్​, మంత్రి జూపల్లి అభినందనలు
  • సాహిత్యంలో విశేష కృషికి అవార్డు

హైదరాబాద్, వెలుగు: కవి నెల్లుట్ల రమాదేవిని కాళోజీ పురస్కారం వరిచింది. అందెశ్రీ కమిటీ ఆమెను కాళోజీ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రజాకవి, పద్మ విభూషణ్  కాళోజీ నారాయణరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఏటా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది. ఈ నెల 9న కాళోజీ జయంతి ఉత్సవాలు, తెలంగాణ భాషా దినోత్సవం సంబరాల్లో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

2025 సంవత్సరానికి కాళోజీ సాహిత్య పురస్కారం ఎంపిక కోసం తెలంగాణ  గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు.. రమాదేవికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్  రవీంద్ర భారతిలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రమాదేవికి కాళోజీ సాహిత్య అవార్డు అందించనున్నారు.

పుస్తకాలు.. ఎన్నో పురస్కారాలు 
నెల్లుట్ల రమాదేవి కలం పేరు కార్టూనిస్ట్. మనసు భాష (కవిత్వం), రమణీయం (కార్టూన్లు) మనసు మనసుకూ మధ్య (కథలు), చినుకులు (నానీలు), తల్లివేరు (కథలు), డి.కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్, అశ్రువర్ణం (కవిత్వం) రామాయణం-1 (కాలమ్స్) పుస్తకాలను రచించారు. ఆమె రచనలకు ఎన్నో పురస్కారాలు దక్కాయి. సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం (కవయిత్రి తొలి సంపుటికి), అపురూప అవార్డు, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం, జాతీయ సాహిత్య పరిషత్తు , సిద్దిపేట వారి ఐతా భారతి చంద్రయ్య సంప్రదాయ కథా సాహితీ పురస్కారం, గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు, గుర్రం జాషువా ఫౌండేషన్ అవార్డు, వెంకటసుబ్బు స్మారక అవార్డు, పర్చా రంగారావు స్మారక అవార్డు, తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహిత్య పురస్కారం, రాగతి పండరి స్మారక పురస్కారం, ప్రొఫెసర్ వాసిరెడ్డి భాస్కర్ రావు స్మారక పురస్కారం, ఎక్స్ రే పత్రిక ఉత్తమ కవితా పురస్కారం, డాక్టర్  రాణీ పులోమజాదేవి స్మారక గౌరవ పురస్కారం, డాక్టర్  సినారె సాహిత్య పురస్కారం, వరంగల్ వారి’ సాహిత్య కళానిధి’ పురస్కారం అందుకున్నారు. అలాగే కార్టూన్లు, కవిత్వం, కథలకు బహుమతులు కూడా పొందారు.

రమాదేవి నేపథ్యం..
ఉమ్మడి వరంగల్​ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​కు చెందిన నెల్లుట్ల రామచందర్​రావు, శకుంతలాదేవి దంపతుల సంతానం రమాదేవి. ఆమె స్టేషన్​ ఘన్ పూర్​లోనే పదో తరగతి చదివారు. హైదరాబాద్​ నారాయణగూడలోని ఆర్​బీవీఆర్ఆర్​ విమెన్స్​ కాలేజీలో ఇంటర్​, డిగ్రీ పూర్తి చేశారు. వరంగల్​ కేయూలో ఎంఏ (ఎకానమిక్స్) చదివారు. ఆంధ్రా బ్యాంకులో సీనియర్​ బ్యాంక్​ మేనేజర్​గా పనిచేసిన ఆమె ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ట్రైనింగ్​ ఇస్తున్నారు. ఏటా పాఠశాల విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్‌లో సభ్యురాలిగా, పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.